హైద్రాబాద్ నగరంలోని ఎన్ జీ వో కాలనీలో మంగళశారం నాడు తెల్లవారుజామున వాకర్స్ పై కారు దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో వాకర్స్ తృటిలో తప్పించుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఎన్ జీ వో కాలనీలో మంగళవారంనాడు తెల్లవారుజామున వాకర్స్ పై కారు దూసుకెళ్లింది. అయితే అతి వేగంగా వస్తున్న కారును చూసి వాకర్స్ తప్పుకున్నారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టి కారు నిలిచిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
మద్యం మత్తులో కారును నడిపినట్టుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారు అతివేగంగా నడిపారని స్థానికులు చెప్పారు. కారులో ఉన్నవారికి కూడా గాయాలయ్యాయి.
ఇవాళ తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న దుకాణం షట్టర్ ను ఢీకొట్టి నిలిచిపోయిం.ది ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని స్పీడోమీటర్ సూచిస్తుంది.
వనస్థలిపురం ఎన్ జీ వో కాలనీలో రోడ్డుపై వాటర్ వర్క్స్ అధికారులు పనులు నిర్వహిస్తున్నారు రోడ్డు మధ్యలో రోడ్డును తవ్వారు. రోడ్డును తవ్విన ప్రాంతం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కారు అతి వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్టుగా స్థానికులు చెప్పారు. కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించ వెంటనే కారు డోర్లు ఓపెన్ చేశారు. ఈ కారులో ఉన్న ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత వెళ్లిపోయారు. ప్రమాదానికి వాటర్ వర్క్స్ అధికారులు తీసిన గుంత కూడా కారణమైందని ప్రత్యక్షసాక్షులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంథించి పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.