తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలని అమిత్ షా ఇరు పార్టీల వారికీ సూచించారు. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో కసరత్తు మొదలయ్యింది.
ఢిల్లీ : వచ్చే నెల జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. జనసేన, బిజెపి కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు. బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో జనసేనతో పాటు బిజెపి నేతలు కూడా ఉన్నట్లుగా, సుమారు 40 నిమిషాల పాటు చర్చించి.. ఈ అంశం మీద ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం నాడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో…తన పర్యటన లోపే సీట్ల సర్దుబాటుపై టీ బీజేపీ, జనసేన ఒక అవగాహనకు రావాలని అమిత్ షా వారికి సూచించగా, ఇరు పార్టీల నేతలు అంగీకరించినట్లుగా విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న విషయంలో అంతర్గతంగా ఇరుపార్టీల్లోనూ చర్చించుకుంటామని… ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నది చెబుతామని కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లు.. అమిత్ షాక్ చెప్పినట్లుగా సమాచారం.
కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీ కొట్టనున్న రేవంత్ రెడ్డి...!
ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 33 సీట్లలో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు.. ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో సీట్లు తమకే కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశంతో కలిసి పని చేయబోతున్న విషయం చర్చకు రాలేదని తెలుస్తోంది. కేవలం తెలంగాణలో మాత్రమే జనసేన తో కలిసి పోటీకి వెళ్లాలని చర్చించారు.
భేటీ అనంతరం బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డిలు భేటీ కావాలని అనుకున్నారు.. కానీ నడ్డా వేరే సమావేశంలో ఉండడంతో కలవడం కుదరలేదు.దీంతో ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడకుండానే విమానాశ్రయానికి వెళ్లిపోయారు. సమావేశానికి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో హైదరాబాదులో ప్రాథమికంగా చర్చలు జరిపామని జాతీయ నాయకత్వంతో మాట్లాడదామని జనసేన అధినేత అనడం వల్లే ఢిల్లీకి వచ్చినట్లుగా తెలిపారు.
ఈ సమయంలో విలేకరులు.. ఏపీలో జనసేన, టిడిపి పొత్తులో ఉంది కదా.. తెలంగాణలోనూ జనసేనతో టీడీపీ కలిసి వస్తుందా అని ప్రశ్నించారు. దీనికి కిషన్ రెడ్డి బదిలీస్తూ.. ఎన్డీఏలో జనసేన ఒకటే భాగస్వామి ఈ మేరకే మా చర్చలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏపీలో జనసేన ఎవరితో పొత్తులు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం బిజెపితో కలిసి పోటీ చేయాలని అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలిపారు. జనసేన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.