
తెలంగాణ అధికారం కైవసం చేసుకునే కసరత్తును బీజేపీ మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణలో అధికారం కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగడానికి ఒక ప్రత్యేక ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర నాయకత్వంలో జోష్ నింపింది. అలాగే పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో.. రాష్ట్ర బీజీపీ నాయకత్వం కార్యకలాపాల్లో వేగం పెంచింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన చేశారు. మూడు కమిటీల విషయానికి వస్తే.. చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, టీఆర్‌ఎస్ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన కమిటీలు ఉన్నాయి. మరోవైపు నేడు (జూన్ 5) తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం కూడా నిర్వహించున్నారు.
ఈ కమిటీల్లో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. గతేడాది టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఈటలకు.. ఇతర రాజకీయ పార్టీల నేతలు బీజేపీలో చేరడాన్ని పర్యవేక్షించే బృందానికి కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కమిటీలో ఆదివారం బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా చోటు కల్పించారు. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికలపై సమన్వయ కమిటీలో.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కె లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, ఎ చంద్రశేఖర్, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లు ఉన్నారు.
ఇదివరకు చేరికల కమిటీకి చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా బీజేపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు వారి పార్టీలో చేర్చుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులతో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలను టార్గెట్‌గా చేసుకుని మంతనాలు సాగిస్తుంది. ఈ తరుణంలో ఇంద్రసేనా రెడ్డి చేరికల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఈటల బాధ్యతలు నిర్వహించారు. ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్.. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ నాయకత్వం భావిస్తుంది.
ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ కోశాధికారి శాంతి కుమార్, యోగానంద్ సభ్యులుగా ఉన్నారు. ఇక, టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అధ్యయన కమిటీకి కన్వీనర్‌గా ఎంపీ ధర్మపురి అరవింద్‌ను నియమించారు. ఈ కమిటీలో వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, స్వామి గౌడ్, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, బాబీ అజ్మీరాలు సభ్యులుగా ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం అమిత్ షాలు పాల్గొన్న విజయ సంకల్ప సభ, జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావడంతో బీజేపీ ఉత్సాహంగా ఉందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలో వస్తుందనే విశ్వాసం కల్పించిందని చెప్పారు. మరోవైపు తెలంగాణలోని పార్టీ సీనియర్లు సోమవారం ఉదయం విజయవాడకు వెళ్లే ముందు రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ కలిశారు. ఈ సందర్భంగా మోదీ నేతలను అభినిందినట్టుగా ప్రేమేందర్ రెడ్డి చెప్పారు.
ఇక, మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందులో జాతీయ కార్యవర్గ సమావేశ ఫలితాలను సమీక్షించి, తెలంగాణ రోడ్ మ్యాప్‌పై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర భాజపా నాయకులు, తెలంగాణకు చెందిన జాతీయ నాయకులు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు హాజరుకానున్నారు.