రెండు తెలుగు రాష్ట్రాల‌పై బీజేపీ ఫోక‌స్.. బ‌ల‌మైన బీఆర్ఎస్, వైకాపాల‌కు ఎదురునిలిచేనా?

By Mahesh Rajamoni  |  First Published Jun 11, 2023, 5:48 PM IST

Visakhapatnam: కర్ణాటకలో ఘోర ప‌రాజ‌యం నుంచి తేరుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ద‌క్షిణాధిలోని రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. మరికొద్ది రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటనతో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల ప్ర‌చారం షురూ చేయ‌డంతో పాటు పొత్తుల పునర్వ్యవస్థీకరణ చ‌ర్య‌ల‌తో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది.
 


BJP focuses on two Telugu states: కర్నాటకలో ఘోర పరాజయం పాలైన నెల రోజుల తర్వాత వచ్చే ఎన్నికలకు సన్నాహకంగా బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్  పెట్టింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ అగ్ర‌నేత‌లు ఇరు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతి పర్యటన ముగిసిన మరుసటి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం విశాఖపట్నం వస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పునర్విభజన కోసం రాజకీయ కార్యాచరణకు తెరలేపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు కోసం సీరియస్‌గా చర్చలు జరపడానికి ముందు బీజేపీ నేతల పర్యటనలు రాష్ట్ర ప‌రిస్థితుల‌ను పరీక్షించే ప్రయత్నాలకు నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏపీలో పొత్తులతో.. 

Latest Videos

undefined

2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర ప‌రాజ‌యం పాలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. నడ్డా, అమిత్ షా పర్యటనలు ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా క‌నిపిస్తోంది. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత వారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడం ఇదే తొలిసారి. జూన్ 3న ఢిల్లీలో అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై వారు చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల చేదు అనుభవాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా ఆ కూటమి తరఫున ప్రచారం చేసి నరేంద్ర మోడీ, చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీపై వెనక్కి తగ్గినందుకు టీడీపీ, బీజేపీలతో జనసేన సంబంధాలు తెంచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలగడానికి టీడీపీ ఇదే అంశాన్ని ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ కూడా కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. 25 లోకసభ స్థానాలకు గాను రెండింటిని గెలుచుకుంది. అయితే, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో టీడీపీ అధికారాన్ని కోల్పోగా, బీజేపీ ఖాళీ చేతులు మిగిల్చుకోగా,  జనసేన కేవలం ఒక అసెంబ్లీని మాత్రమే గెలుచుకోగలిగింది.

2019 ఓటమి తర్వాత జనసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాదాన్ని పూడ్చాలని భావించినప్పటికీ, పార్లమెంటులో కీలకమైన బిల్లులపై బీజేపీకి వైకాపా మద్దతు ఇస్తుండటంతో పెద్ద‌గా స్పందించ‌లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు పొత్తు ఖరారు చేయాలని పవన్ కళ్యాణ్ బీజేపీపై ఒత్తిడి తీసుకువ‌చ్చే చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. శనివారం తిరుపతి బహిరంగ సభలో నడ్డా చేసిన ప్రసంగం చూస్తే వైసీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ సన్నద్ధమవుతోందని అర్థమవుతోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అరాచకాలంటూ సీఎం జ‌గన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. "నేను చూసిన అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో వైఎస్సార్సీపీ ఒకటి అని చెప్పడానికి చింతిస్తున్నాను. కుంభకోణాలకు అంతం లేదు. మైనింగ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, భూకుంభకోణం, విద్యా కుంభకోణాలు ఉన్నాయి. ఏ తరహా కుంభకోణం జరగడం లేదో చెప్పాలంటూ" ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 'ఆల్కహాల్ ఎకానమీ'గా వైసీపీ మార్చిందని నడ్డా విమర్శించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిలో రాజధానిని నిర్మించకపోవడంపై జగన్ ప్రభుత్వంపై బీజేపీ అధినేత మండిపడ్డారు.

తెలంగాణలోనూ.. 

2023 నవంబర్-డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో తమ విజయావకాశాలపై కాషాయ పార్టీ ధీమాగా ఉంది. కర్ణాటకలో ఓటమి తెలంగాణలో పార్టీ సన్నాహకాలకు గండికొట్టినప్పటికీ జూన్ 15న అమిత్ షా పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తోంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. గత 3-4 సంవత్సరాలుగా తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ.. కర్ణాటక తర్వాత దక్షిణాదికి తెలంగాణ తన రెండో ముఖద్వారంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే, కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంలో ఆ పార్టీ విఫలం కావడం ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. మిషన్ 2023తో బీజేపీ దూకుడుగా పని చేస్తున్నప్పటికీ కర్ణాటకలో ఓటమి తర్వాత దాని ఆత్మవిశ్వాసం దెబ్బతింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి మరింతగా దెబ్బ‌కొట్టాయి. 

ఈటల రాజేందర్, ఇటీవల పార్టీలో చేరిన మరికొందరు బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తితో ఉన్నారనీ, కొత్త నాయకుడిని నియమించాలని కేంద్ర నాయకత్వాన్ని కోరుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాషాయ పార్టీ అసలు బలం ఏమిటని బీజేపీకి చెందిన ఓ సీనియర్ కేంద్ర నేత ఇటీవల చేసిన ప్రకటన కూడా ఆ పార్టీ శ్రేణులను కుంగదీసింది. రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలో ఉంద‌ని ఆయ‌న‌ అంగీకరించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నరేంద్ర మోడీ, అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. అయితే,  లోక్ స‌భ ఎన్నికల్లో కాషాయ పార్టీ తన అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగు లోక్ స‌భ‌ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆ పార్టీ భవితవ్యం పుంజుకుంటూ వచ్చింది. ఉప ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

తెలంగాణలో ప్రచారానికి దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలను రంగంలోకి దింపాలని బీజేపీ చూస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో బీజేపీ నేతల పర్యటనలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ బీజేపీకి అనుకూల ప‌రిస్థితులు ఉన్న ప్రాంతంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మత ప్రాతిపదికన ఓట్ల చీలిక కోసం ఆ పార్టీ అనేక వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం రాజకీయ ఆధిపత్యం, కేసీఆర్ ప్రభుత్వంతో ఒవైసీల స్నేహం, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు, ఉర్దూకు రెండో అధికార భాష హోదా, హైదరాబాద్ విమోచన దినోత్సవం వంటి అంశాలను కాషాయ పార్టీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. అయితే, బ‌ల‌మైన కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని ఎదుర్కొవ‌డం అంత తేలిక కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

click me!