వామన్‌రావు హత్యకు ప్రత్యేకంగా ఆయుధాలు తయారీ, బిట్టు శీను అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి

By narsimha lodeFirst Published Feb 22, 2021, 7:05 PM IST
Highlights

లాయర్ వామన్ దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్టుగా ఐజీ నాగిరెడ్డి చెప్పారు.

కరీంనగర్: లాయర్ వామన్ దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్టుగా ఐజీ నాగిరెడ్డి చెప్పారు.సోమవారం నాడు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి నాగిరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. బిట్టు శ్రీనుపై గతంలో వామన్ రావు  ఆరోపణలు చేశాడు. బిట్టు శ్రీను నడుపుతున్న ట్రస్ట్ పై వామన్ రావు కేసులు వేశాడు. దీంతో బిట్టు శ్రీను ఆదాయాన్ని కోల్పోయాడని ఐజీ చెప్పారు.

దీంతో వామన్ రావుపై బిట్టు శ్రీను  కక్ష పెంచుకొన్నాడని ఆయన చెప్పారు. బిట్టు శ్రీను, కుంట శ్రీనులు ఇద్దరూ స్నేహితులు. వామన్ రావుతో కుంట శ్రీనుకు విరోధం ఉంది. దీంతో వామన్ రావును చంపేందుకు తాను సహాయం చేస్తానని బిట్టు శ్రీను హామీ ఇచ్చాడని ఐజీ తెలిపారు.

వామన్ రావును హత్య చేసేందుకు ఎలాంటి సహాయమైనా చేస్తానని బిట్టు శ్రీను హామీ ఇచ్చారని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.వామన్ రావు హత్యకు నాలుగు నెలల క్రితమే  బిట్టు శ్రీను రెండు ఆయుధాలను తయారు చేయించాడు. ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తులను తయారు చేయించినట్టుగా విచారణలో తాము గుర్తించామని ఐజీ చెప్పారు. 10 నెలలుగా వామన్ రావు కోసం బిట్టు గ్యాంగ్ ఎదురు చూస్తోందని పోలీసులు గుర్తించారు.

మంథని కోర్టు సమీపంలోనే హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడ కూడ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇంటి సమీపంలోనే వామన్ రావును హత్య చేయాలనుకొన్నారు ఈ రెండు చోట్ల జనం ఎక్కువగా ఉండడంతో కుంట శ్రీను ప్లాన్ మార్చుకొన్నారని ఐజీ నాగిరెడ్డి వివరించారు.చివరగా కల్వచర్ల వద్ద వామన్ రావును హత్య చేశారన్నారు. నిందితులకు వాహనాలతో పాటు ఆయుధాలను బిట్టు శ్రీను సమకూర్చాడని  ఐజీ తెలిపారు. 

హత్య చేసిన తర్వాత నిందితులను మహారాష్ట్రకు పారిపోవాలని బిట్టు శ్రీను నిందితులకు వివరించినట్టుగా చెప్పారు. శాస్త్రీయ ఆధారాలతో కేసును విచారిస్తున్నామన్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. 

click me!