తెలంగాణ పంతులుకు పోటెత్తిన జన్మదిన శుభాకాంక్షలు

Published : Sep 04, 2017, 11:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తెలంగాణ పంతులుకు పోటెత్తిన జన్మదిన శుభాకాంక్షలు

సారాంశం

కోదండరాంకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ ఒక రోజు ముందునుంచే షురూ చేసిన అభిమానులు సోషల్ మీడియాలో పోటాపోటీగా అభినందనలు

ఆయన ఒక బడి పంతులు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పుడే కాదు ప్రజా క్షేత్రంలో లక్షల మందికి ఉద్యమ పాఠాలు నేర్పిన ఘనుడు. ఆయన నేర్పిన పాఠాలు తెలంగాణ యావత్ జాతిని ఉద్యమకారులుగా మలిచాయనడంలో సందేహం లేదు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ పాఠాలు వల్లె వేసిన ఆయన తర్వాత కూడా అదే ఉద్యమాలతో మమేకమయ్యారు. జనాల నుంచి నేర్చుకున్నారు. జనాలకు నేర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగక పోరాడిన జెఎసి ఛైర్మన్ కోదండరాం కు  ఒక రోజు ముందునుంచే జన్మదిన శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. 

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోశించారు. ఆయన ఉద్యమ సమయంలో 365 రోజులూ ఉద్యమంలోనే ఉన్నారు. నచ్చినప్పుడు ఉద్యమాన్ని, జనాల్లో ఆందోళన, ఆవేశాన్ని రగిలించడం, నచ్చకపోతే తాను పండుకుని ఉద్యమాన్ని పడుకోబెట్టడం లాంటి చర్యలకు ఆయన దూరంగా ఉన్నారు. మంచో చెడో తాను నడిచే దారిలో విశ్రమించకుండా కదిలారు. అంతిమంగా తెలంగాణ సాధనలో ఆయన తన వంతు పాత్ర పోశించారు.

విద్యార్థి దశ నుంచే కోదండరాం చదువు పోరాడు అనే సిద్ధాంతం ప్రాతిపదికగా పనిచేశారు. ఢిల్లీ లోని జవహర్ లాల్ విశ్వ విద్యాలయంలో చదివే రోజుల్లో ఆయన చేసిన ఆమరణ దీక్ష యావత్ విద్యార్థి లోకంలో ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పుడే కాదు అంతకంటే ముంద, ఆ తర్వాత కూడా ఆయన ప్రజా సేవలో ఒదిగిపోయారు. ప్రొఫెసర్ గా పాఠాలు చెబుతూనే అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అహర్నిషలు పనిచేశారు. 

ఒక మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, ఒక సడక్ బంద్ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా జెఎసి ఛైర్మన్ కోదండరాం ముందుండి విజయవంతం చేశారు. తెలంగాణ ఉద్యమంలో  అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి పనిచేయడంలో కోదండరాం పడని పాట్లు లేవు. తెలంగాణ ఉద్యమ కాలంలో కోదండరాం కొందరికి దేవుడిగా కనిపించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అదే ఆ కొందరు జనాలకు దెయ్యం లాగా కూడా కనిపిస్తున్నాడు.

తెలంగాణ రాకముందు కోదండరాం ఎన్నో ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు. విద్యార్థి దశ నుంచే ఆయన కష్టాలకు, బాధలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. అనునిత్యం ప్రజల కోసం తపించారు. కానీ ఆయన జీవితంలో పడిన కష్టాలకు ప్రతిఫలంగా తెలంగాణ సాధించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో కష్టాలు తొలగిపోతాయనుకుంటే కష్టాలు అలాగే ఉన్నాయి. కానీ అంతకంటే ప్రమాదకరమైన అవమానాలను ఆయన మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అర్హత ఉన్నవారు, లేనివారు సైతం ఆయనపై ఒంటికాలు మీద లేస్తూ విమర్శలు గుప్పిస్తున్న తీరు చూస్తే జనాలు సైతం ఈసడించుకుంటున్నారు. తెలంగాణ సాధన వరకు కష్టాలను లెక్కచేయిన ఆయన తెలంగాణ స్వరాష్ట్రంలో అవమానాలను మాత్రం భారంగానే మోస్తున్నారు. ఎవరు ఏమి అన్నప్పటికీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా పోరుబాటు సాగిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అది సెప్టెంబరు 5. కానీ కాకతాలీయంగా అదేరోజున కోదండరాం కూడా  జన్మించారు. కోదండరాం టీచర్స్  డే న జన్మించారు, టీచర్ అయ్యారు. విద్యార్థులకే కాక సమాజానికే సామాజిక పాఠాలు నేర్పుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.