
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఈ రోజు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.
బీసీ-ఈలకు 12 శాతానికి, ఎస్టీలకు10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల సభ్యులు దీనిపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు అందించారు.
అయితే ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ సభలోనూ అదే విధమైన ధోరణి అవలంభించింది. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు మాత్రం మద్దతిచ్చింది.
బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంపై అడ్డుతగలగడం సరికాదన్నారు. తమ రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా చూస్తామన్నారు. కేంద్రం దీనికి ఒప్పుకోకుంటే పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని ప్రకటించారు.
ముస్లిం రిజర్వేషన్లకు మతం రంగు పులుముతు కొన్ని పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను పెంచామని గుర్తు చేశారు.