కేసీఆర్ కు తలనొప్పి: సిట్టింగ్ లపై తిరుగుబాట్లు

By pratap reddyFirst Published Aug 30, 2018, 7:20 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తామనే సంకేతాలను ఇవ్వడంతో పలు నియోజకవర్గాల్లోతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో లుకలుకలు బయటపడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి నేతలు తిరుగుబాటు చేస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తామనే సంకేతాలను ఇవ్వడంతో పలు నియోజకవర్గాల్లోతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో లుకలుకలు బయటపడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి నేతలు తిరుగుబాటు చేస్తున్నారు.

నాలుగైదు నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటిలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇస్తామని కేసిఆర్ చెప్పారు.  సిట్టింగులకు టికెట్లు ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.

వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని రమేష్ బాబు ఎదురు వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. దాదాపు వేయి మంది పార్టీ కార్యకర్తలు సమావేశమై రమేష్ బాబుకు టికెట్ ఇవ్వొద్దని తీర్మానించి, ఈ మేరకు కేసిఆర్ కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. 

రామగుండం నియోజకవర్గంలోనూ వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు వ్యతిరేకంగా మాజీ మేయర్ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సోమారపు తిరిగి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు. 

సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేద సభకు ప్రజలను సమీకరించడానికి జిల్లాల్లో జరుగుతున్న సమావేశాల్లో అసంతృప్తి నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. 

నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో జరిగిన సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ డుమ్మా కొట్టారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి శంకరమ్మను హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీగా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో శంకరమ్మ, శివారెడ్డి గ్రూపులు బాహాటంగానే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. 

ఆ రెండు గ్రూపుల మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలోనే టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి చెబుకుంటూ, నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. 

చొప్పదండి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే బి శోభ, చుక్కారెడ్డి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లోనూ రెండు గ్రూపుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. 

చెన్నూరు టికెట్ కోసం పార్లమెంటు సభ్యుడు సుమన్ తనకే టికెట్ వస్తుందని చెబుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలు పరిస్థితి గందరగోళంలో పడింది.  

click me!