మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి భువనగిరి ఎంపీకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండే అవకాశం ఉంది. స్వంత పార్టీ నేతలే దూషించడంతో తాను ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేదని ఆయన చెబుతున్నారు.
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి ని ఆ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీని వీడి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. తన సోదరుడు బీజేపీలో చేరినా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న పాల్వాయి స్రవంతి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. తనను ఆశీర్వదించాలని కోరారు. తనను గెలిపించేందుకు ప్రచారం చేయాలని కోరారు. ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని స్రవంతి చెబుతున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఆగస్టు 5న సభ నిర్వహించింది. ఈ సభ విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకోపవడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. .ఈ సభలో తనను అద్దంకి దయాకర్ దూషించారన్నారు.
స్వంత పార్టీ నేతలనే తనను దూషించడం జీర్ణించుకోలేకపోతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఆత్మ ప్రబోధానుసారం తాను మునుగోడులో ప్రచారానికి వెళ్లాలో వద్దో నిర్ణయం తీసుకొంటానని చెప్పారు.. ఈ వ్యాఖ్యలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పడంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెలిక పెట్టారు. తాను ప్రచారానికి వెళ్తే మళ్లీ తనపై స్వంత పార్టీ నేతలే ఏదో వ్యాఖ్యలు చేయరని గ్యారంటీ లేదు కదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సభలోనే దూషించినా ఎలా ప్రచారానికి వస్తారని తనను తన అభిమానులు ప్రశ్నిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెబుతానని మీడియాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కానీ ప్రచారానికి వెళ్లే విషయమై మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది ఉమ్మడి కుటుంబం. స్వంత సోదరుడు బీజేపీ అభ్యర్ధిగా ఈ ఉప ఎన్నికల్లో బరిలో ఉన్నాడు. అయితే ఈ సమయంలో తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై పార్టీ నాయకత్వం దృష్టికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉండేందుకు అనుమతివ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరినట్టు ప్రచారం ఉందని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి మీడియాకు చెప్పారు.
also read:నా జోలికి వస్తే మీ అవినీతి చిట్టాను విప్పుతా: కేసీఆర్ కుటుంబానికి కోమటిరెడ్డి వార్నింగ్
గత నెలలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.