
హైదరాబాద్: ప్రజా సమస్యలు తీర్చేందుకు తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై తాను రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తెస్తానన్నారు.ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
also read:రేవంత్ రెడ్డి నియామకంపై వ్యాఖ్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం
ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణంలో నిర్లక్ష్యంతో జిల్లాలో వేలాది ఎకరాలు బీడువారుతోందన్నారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు.90 శాతం పూర్తైన బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నాయకత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకొంది.