తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం... ఎమ్మెల్యే దంపతులకు పాజిటివ్

By Arun Kumar PFirst Published Feb 24, 2021, 9:28 AM IST
Highlights

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

భూపాలపల్లి: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  

నెమ్మదించిందని భావించిన కరోనా వైరస్ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తుండంతో కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఉలిక్కిపడ్డాయి. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత దృష్ట్యా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ప్రస్తుతం భారతదేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అందులో పలు మ్యూటేషన్లు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరించారు. 5 వేలకు పైగా కొత్త కరోనా రకాలపై సమగ్ర పరిశీలన చేసి కరోనా ఎలా మార్పులు చెందిందో సీసీఎంబీ అధ్యయనం చేసింది. అనంతరం దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. ముఖ్యంగా ఎన్‌ 440కే అనే కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం దేశంలో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎన్‌ 440కే రకం దక్షిణాది రాష్ట్రాల్లోనే విజృంభిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

ప్రతి వైరస్‌ ఉత్పరివర్తనం కొత్త రకం కరోనా వైరస్‌ కానక్కర్లేదని ఆయన చెప్పారు. అయితే కరోనా జన్యు సమాచారం జెనెటిక్‌ కోడ్‌ను కనుగొనడంలో భారత్‌ మిగిలిన దేశాలతో పోలిస్తే వెనకబడి ఉందని మిశ్రా అన్నారు. ఇప్పటి వరకు కోటి కరోనా కేసుల్లో కేవలం 6400 జీనోమ్‌లను కనుగొన్నామని రాకేశ్ మిశ్రా వెల్లడించారు. 
  

click me!