మరియమ్మ లాకప్ డెత్ : కేసీఆర్ నీకు బుద్దుంటే, నువ్వు మనిషివైతే చంపిన వారిమీద చర్యలు తీసుకో.. భట్టి విక్రమార్క

By AN Telugu  |  First Published Jun 21, 2021, 4:33 PM IST

కనీసం మానవత్వం లేకుండా గ్రామంలోకి వచ్చి మరియమ్మ అనే  మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి.. అర్ధరాత్రి వరకూ కొట్టి హింసించడం అత్యంత అమానుషం.. రాక్షసత్వం అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు.


కనీసం మానవత్వం లేకుండా గ్రామంలోకి వచ్చి మరియమ్మ అనే  మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి.. అర్ధరాత్రి వరకూ కొట్టి హింసించడం అత్యంత అమానుషం.. రాక్షసత్వం అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు.

స్థానిక పోలీసులు లేకుండా బయట నుంచి వచ్చిన అడ్డగూడూరు పోలీసులు హింసించడం ఇంకా అమానుషం అన్నారు. మా అమ్మను కొట్టవద్దు అని ఆమె కుమార్తె కాళ్ళు పట్టుకున్నా.. ఆమె జుట్టు పట్టుకుని బిడ్డ ముందే లాఠీలు విరిగేట్టు కొట్టడం దారుణం అన్నారు.

Latest Videos

బహుశా దేశద్రోహులను, టెర్రస్టులను కూడా ఇంతా దారుణంగా హింసించరని మండిపడ్డారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కొట్టడమే కాక ఉదయం అడ్డగూడూరు స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ కూడా అత్యంత పాశవికంగా పోలీసులు కొట్టి హింసించి చంపారని అన్నారు.

రాష్ట్రంలో పేద వాళ్ళు, దయనీయ స్థితిలో బతకలేనివాళ్ళపై పోలీసుల హింస పెరిగిపోతోంది.  పోలీసులు ప్రజలను రక్షించడానికి ఉన్నారు కానీ ఇలా హింసించి, ప్రజలపై దౌర్జన్యం చేసి చంపేందుకు కాదు. మమ్మల్ని ఎవరూ అడిగేవాడు లేడన్న అహంకారపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

పోలీసులు ఇలా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్.. తనను తాను కాపాడుకోవడానికి పోలీసులకు ఇచ్చిన విచ్చలవిడి అధికారాలు, విశృంఖలంగా వాళ్లు చేసే కార్యక్రమాలు పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజలను పోలీసులు ఎలా హింసించినా పోలీసులు నన్ను కాపాడితే చాలు అనే విదంగా కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దళిత మహిళ మరియమ్మను హింసించి లాకప్ డెత్ చేసి మూడు రోజులు అవుతోంది. ఇటువంటి లాకప్ డెత్ ను బయటకు రాకుండా కాపడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరిపైన, వాస్తవాలు బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసిన వారిపైనా, పోలీస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా స్థానికంగా ఉన్న అధికార యంత్రంగం వాస్తవ పరిస్థితులను బయటకు తీసుకువచ్చి బాధితులను న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోవడానికి అశ్రద్ధే కారణమన్నారు.

 ఇక్కడ నుంచే జిల్లా కలెక్టర్ తో మాట్లాడను.. జరిగిన సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భాద్యులైన అందరిపైన, సంఘటన బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసినా వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. 

బాధితులకు న్యాయం, దోషులపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ దీనిపైనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుందన్నారు. గతంలో మంథని, సిరిసిల్ల  ఘటనల్లో దోషులపై చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇప్పుడు పోలీసులు అతిగా ప్రవర్తించి మరియమ్మను కూడా చంపారన్నారు.

రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం దయ, కరుణ ఉంటే వెంటనే ఈ ఘటనపై స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా మరియమ్మ కుటుంబానికి అందాల్సినవి వెంటనే అందించాలి. చట్టం ప్రకారం రావాల్సిన ఉద్యోగం భూమి కూడా ఆ కుటుంబానికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంఘటన జరిగిన వెంటనే అడ్డగూడూరు స్టేషన్ కు వెళ్లి బాధితుల తరపున పోరాటం చేసిన రాష్ట్ర ఎస్సీ కాంగ్రెస్ చైర్మన్ ప్రీతంను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు.  ఈ ఘటనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, కేంద్ర కమిషన్లకు, మానవ హక్కుల కమిషన్ కు ఎస్సీ డిపార్ట్ మెంట్ ద్వారా లేఖలు రాస్తామన్నారు.

మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడానికి చెందిన మ‌రియ‌మ్మ‌, ఆమె కుమారుడు ఉద‌య్ కిర‌ణ్ ను  భువ‌న‌గిరి జిల్లా అడ్డ‌గూడూరుకు చెందిన పోలీసులు ఈ నెల 16న వారిని పిక‌ప్ చేసుకునివెళ్లి.. అడ్డ‌గూడూరు స్టేష‌న్ లో గొడ్డునుబాదిన‌ట్టు బాద‌డం అత్యంత బాధాక‌రం. నాలుగు రోజులపాటు కొట్టిన చోట కొట్టకుండా కొట్టడం బాధాకరం.

ఈనెల 17న మ‌ళ్లీ మ‌రియ‌మ్మ‌ను చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడెం తీసుకువ‌చ్చి గ్రామ‌స్థులంతా చూస్తుండ‌గా.. చింతకానీ పోలీస్ స్టేషన్ లో వదిలేస్తామని చెప్పి, చింతకానీ కాకుండా కొనిజర్ల తీసుకువెళ్లి.. కుమార్తె ముందే మరియమ్మును శారీరకంగా హీంసించడం బాధాకరం. 

అక్కడ నుంచి రాత్రి 10.30 ప్రాంతంలో చింతకానీ స్టేషన్ కు తీసుకువచ్చి, చంటిబిడ్డతో ఉన్న కుమార్తె ముందు రాత్రంతా పైన గదిలో నాలుగు కానిస్టేబుల్స్ (మహిళా కానిస్టేబుల్ లేకుండా) ఒకరి తరువాత ఒకరు ఒళ్ళు హూనం అయ్యేట్లు లాఠీలతో కొట్టారు.  దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాథుడే లేడు.

చివరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకానీ నుంచి అడ్డగూడూరు స్టేషన్ కు తరలించి అక్కడ కూడా విపరీతంగా కొడితే.. దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతుల్లో పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు విడిచిందని చెప్పుకొచ్చారు.

నా చేతుల్లోనే మా అమ్మ చనిపోయిందని ఉదయ్ కిరణ్ చెబుతుంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈ ఘటనను భట్టి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో అర్థం అవుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల సామాన్యులు ఎవరూ బతికే పరిస్థితి లేదు. పౌర హక్కుల లేవు. ప్రజల మీద విశృంఖలంగా పోలీసుల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. 

 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంపబడుతున్నారు. అయిన ఇంతవరకూ ఎక్కడ న్యాయం జరగ లేదు. ప్రతిపక్ష నాయకుడైన నా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి తీసుకెళ్లి తెల్లవార్లు పోలీస్ స్టేషన్ లో కొట్టి, హింసించి చంపితే.. సిగ్గులేని ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫెరెన్స్ పెట్టి దళితుల సాధికారత కోసం నా ప్రభుత్వం అని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.

కే చంద్ర శేఖర రావు నీకు బుద్ది ఉందా? నువ్వు మనిషివి అయితే మరియమ్మను కొట్టి చంపిన వారిమీద చర్యలు తీసుకోకుండా ఉన్న నీ ప్రభుత్వంలో సామాన్యుల బతుకు ఏమిటో అర్థం అవుతోంది. నువ్వూ..నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సామాన్యులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులూ తుంగలో తొక్కబడ్డాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. నీకు శిక్ష తప్పదు కేసీఆర్. 

 మరియమ్మను చంపిన, ఆమె కొడుకును గొడ్డును బాదినట్లు బాదిన పోలీస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఈ ఉదంతాన్ని బయటకు రాకుండా చేసిన వారిపైనా.. పోలేసులపైన అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. 

అట్రాసిటీ యాక్ట్ ప్రకారం, ఇందిరాగాంధీ కల్పించ చట్టారక్షణల ప్రకారం బాధిత కుటుంబానికి రావలసిన అన్ని సదుపాయాలు తప్పకుండా రావాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.. చట్టప్రకారం రావాల్సిన ఆర్థిక సహాయం అందించాలి. 

ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే పూర్తి సమాచారం తెప్పించుకుని.. భాదితులకు న్యాయం చేయడంతో పాటు దోషులపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఏ స్థాయికైనా వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం. 

అవసరమైతే న్యాయస్థానాలను, గవర్నర్ ను కలుస్తాం. ముఖ్యమంత్రిని నేను కలిస్తాను. మీడియా ద్వారా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. దళితులపై పోలీసులు చేస్తున్న దాస్థీకలను కట్టడి చేయకపోతే తిరుగుబాటు తప్పదు. 

భట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ జావీద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, ఎస్సీ రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

click me!