
త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు తుది రూపు ఇచ్చేందుకు ఏఐసీసీ వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థుల తొలి వడపోత పూర్తయ్యింది. దాదాపు 30 సీట్ల వరకు అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గానూ 1100లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించి తొలి విడతగా కొందరి పేర్లను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.. పొత్తులు ఖరారైన తర్వాత వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది..
ఈ జాబితాలపై భక్తచరణ్ దాస్ నేతృత్వంలోని ఏఐసీసీ త్రిసభ్య స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.. దీనిలో భాగంగా దాస్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు గోల్కొండ హోటల్‌లో టీపీసీసీ నేతలతో చరణ్ దాస్ సమావేశమవుతారు. అనంతరం ఈ నెల 16న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల తుది జాబితాను అందించనుంది.