సెప్టెంబర్ 19న గణేశ్ నిమజ్జనం, అందరూ అదే రోజు చేయాల్సిందే: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ

By Siva KodatiFirst Published Sep 16, 2021, 7:34 PM IST
Highlights

ఈనెల 19న హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం చేయాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సూచించింది. ఈ మేరకు గురువారం ప్రధాన కార్యదర్శి భగవంతరావు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, గణేశ్‌ ఉత్సవ సమితి కలిసి వచ్చే ఏడాది హైకోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు
 

సుప్రీంకోర్ట్ తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని మండపాల నిర్వాహకులు ఈనెల 19న గణేశ్‌ నిమజ్జనం చేయాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సూచించింది. ఈ మేరకు గురువారం ప్రధాన కార్యదర్శి భగవంతరావు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.  ప్రభుత్వం, గణేశ్‌ ఉత్సవ సమితి కలిసి వచ్చే ఏడాది హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం జరిగేలా విజయం సాధిస్తామని... నిమజ్జనం అనంతరం పీఓపీ పరీక్షలు చేసి హైకోర్టుకు నివేదిక ఇస్తామని భగవంతరావు పేర్కొన్నారు. హైకోర్టుకు ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వకపోవడం వల్లే నిమజ్జనంపై సందిగ్ధత తలెత్తింది అని ఆయన ఆరోపించారు.

కాగా, హైద్రాబాద్  ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వినాయక విగ్రహల నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి మాత్రమే సుప్రీంకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనానికి అనుమతిని ఇచ్చింది. 

ఇదే  చివరి అవకాశమని కూడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ఆదేశించారు.హైద్రాబాద్ లో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ గుర్తు చేశారు. హైద్రాబాద్ లో ఎప్పటి నుండో నిమజ్జనంపై ఈ సమస్య ఉందన్నారు. ఏటా ఎవరో ఒకరు పిటిషన్ వేస్తూనే ఉన్నారని సీజేఐ చెప్పారు.

click me!