
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ ఈ నెల 27న ఖమ్మం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షా సభ పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. వరుస వాయిదాలతో బీజేపీ క్యాడర్‌లోనూ నిరాశ ఏర్పడింది. ఈ సారి ఎలాగైనా సభ నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నది. ఈ తరుణంలో 27 నిర్వహించే సభ ముంగిటే ఆ పార్టీకి షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
అనంతరం, ఆయన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను కలిశారు. కోనేరు సత్యనారాయణ (చిన్ని) తండ్రి నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం టీడీపీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం, కోనేరు సత్యనారాయణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను కలవడంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరిక కన్ఫామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావును గెలిపించుకోవడానికి కృషి చేయాలని కోనేరు సత్యానారాయణకు సూచనలు చేశారు.
ఖమ్మం జిల్లా బీజేపీలో ఇప్పటికే వర్గవిభేదాలు పలుమార్లు బయటపడ్డాయి. తాజాగా, ఏకంగా ఒక జిల్లా అధ్యక్షుడే బయటికి వచ్చారు. ఇదిలా ఉండగా.. హోం మంత్రి అమిత్ షా పాల్గొనే ఖమ్మం సభలో బీజేపీలోకి చాలా మంది చేరుతారని ఆ పార్టీ నేతలు చెప్పడం గమనార్హం. 27వ తేదీ తర్వాత వరుస చేరికలు ఉంటాయని ఈటల చెప్పారు.