బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న సూర్యపేట సభలో ప్రకటించారు. ఈ ప్రకటనపై రాష్ట్రస్థాయి బీసీ నేత బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈయనతోపాటు ఈటల రాజేందర్, కే లక్ష్మణ్‌లు కీలక బీసీ నేతలుగా బీజేపీలో ఉన్నారు.
హైదరాబాద్: సూర్యపేటలో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తావా? అంటూ కేసీఆర్‌ను నిలదీసిన అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా, బండి సంజయ్ కుమార్ ఈ ప్రకటనపై స్పందించారు.
బీజేపీ బీసీల పక్షపాతి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీసీని సీఎం చేస్తామని ప్రకటించడం హర్షదాయకం అని వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి ఉన్నదని వివరించారు. బీజేపీ సబ్బండ వర్గాల పక్షన పోరుడు తుందని తెలిపారు.
undefined
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. బలమైన నేత ఉంటే బీజేపీ సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి బరిలోకి దిగుతుంది. అయితే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొనే ఛరిష్మా గల నేత లేరు. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. బీజేపీలో రాష్ట్రస్థాయి బీసీ నేతలు ముగ్గురు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్‌లు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పటికీ బీజేపీ వ్యూహాత్మకంగా ఒక నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా గెలిస్తే ఈ కమ్యూనిటీ నేతనే సీఎం చేస్తామని చెప్పి బీసీ కమ్యూనిటీని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కామెంట్ పై ఆసక్తి నెలకొంది.