నల్లగొండ కుటుంబంలో బతుకమ్మ చీర చిచ్చు

First Published Sep 19, 2017, 6:50 AM IST
Highlights
  • కుటుంబంలో బతుకమ్మ చీర చిచ్చు

బతుకమ్మ చీరల పథకం ఒక కుటుంబంలో చిచ్చు రేపింది. భార్య ప్రాణాలు బలితీసుకుంది. భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్ ) మండలం, నెల్లికల్ గ్రామం పంచాయతీ పరిధిలోని జాల్ తండాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలోని పిఎ పల్లి మండలం బూదిదగుట్టకు చెందిన అనితకు, తిరుమలగిరి (సాగర్ ) మండలం జాల్ తాండకు చెందిన రవీందర్ కు 13 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వారికి శ్రీకాంత్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.

సోమవారం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుండగా చీర తెచ్చుకునేందుకు అనతి పోయింది. ఆమె ఆలస్యంగా  రావడంతో భర్త ఆగ్రహించి ఆమెను మందలించాడు. చేయి కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. 

దీంతో ఆమె మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరింది. తర్వాత కొద్దిసేపటి తర్వాత భర్త ఇంటికొచ్చేసరికి భార్య చనిపోయిందని భావించి ఆందోళన చెందాడు. తనవల్లే భార్య మరణించిందన్న భాధతో తానూ పురుగుల మందు తాగిండు.

స్థానికులు గుర్తించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అనితను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతుండగా మరణించింది. రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 

click me!