అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరలు.. జిల్లాలకు చేరిన చీరలు.. 20 రంగుల్లో అందుబాటులోకి..

By telugu teamFirst Published Sep 30, 2021, 7:26 PM IST
Highlights

వచ్చే నెల 2వ తేదీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీ మొదలుకానుంది. ఇప్పటికే చీరలు జిల్లా గోదాములకు చేరాయి. ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లతో చీరలను రూపొందించారు. 20 విభిన్న రంగులతో అన్వయించారు. మొత్తం 810 రకాల చీరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణ ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సమీపించడంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా గోదాములకు చీరలు చేరాయి. వచ్చే నెల 2వ తేదీ నుంచి వీటి పంపిణీ జరగనుంది. గ్రామ లేదా వార్డు స్థాయి కమిటీల ద్వారా వచ్చే నెల 2వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభం కానుంది. 

ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లతో చీరలను రూపొందించారు. 20 విభిన్న రంగులతో అన్వయించారు. మొత్తం 810 రకాల చీరలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సారి ప్రత్యేకంగా డాబీ అంచు చీరలను పంపిణీ చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ విధానాలను నియంత్రించడానికి కలెక్టర్లు స్వేచ్ఛ ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. లబ్దిదారుల ఇళ్ల వద్దే చీరల పంపిణీ చేయటం లేదా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ లేదా వార్డు కేంద్రాల్లో చీరలను పంపిణీ చేయడం వంటి పద్ధతులను కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి నిర్దేశిస్తారు.

6.30 మీటర్ల పొడవుగల ఒక కోటీ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణలోని వయోవృద్ధ మహిళల కోసం 9 మీటర్లు పొడవుగల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 333.14 కోట్లు కేటాయించారు.

సిరిసిల్ల చేనేత కార్మికుల జీవనప్రమాణాలు పెంచడానికి, అలాగే, బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలను గౌరవించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. రేషన్ కార్డు ఉన్న 18ఏళ్లుపైబడిన మహిళలందరికీ ఈ చీరలను పంపిణీ చేస్తున్నది. ఇందుకోసం 2017లో 95, 48,439మహిళా లబ్దిదారులకు, 2018లో 96,70,474 మహిళా లబ్దిదారులకు, 2019లో 96,57,813 మహిళా లబ్దిదారులకు, 2020లో 96,24,384 మహిళా లబ్దిదారులకు చీరలను పంపిణీ చేసింది.

click me!