నంద కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 11:19 AM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నందకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై నమోదైన చీటింగ్‌ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ కేసులో మోసం చేయడంపై నంద కుమార్‌ను ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి  కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నందకుమార్ రెండు రోజుల (నవంబర్ 28,29) కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సోమవారం ఉదయం నందకుమార్‌ను చంచల్‌ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. 


డెక్కన్ కిచెన్‌లోని భాగస్వాములుగా ఉన్నవారు నందకుమార్‌పై చేసిన ఆరోపణల ప్రకారం.. పోలీసులు అతడి నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఒప్పందం చట్టబద్ధత గురించి అధికారులు అతడిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి నేడు, రేపు బంజారాహిల్స్ పోలీసులు నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి నంద కుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెను దాదాపు 8 గంటల పాటు విచారించిన పోలీసులు.. నేడు(సోమవారం) మరోసారి విచారణనకు రావాల్సిందిగా సూచించారు. 

click me!