ఐటీ విచారణకు హాజరవుతున్నాం.. డాక్యుమెంట్స్ తీసుకురావాలని నోటీసుల్లో లేదు: మర్రి రాజశేఖర్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 10:56 AM IST
Highlights

ఐటీ అధికారుల నోటీసుల మేరకు తాను ఈరోజు విచారణకు హాజరుకానున్నట్టుగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఐటీ అధికారుల నోటీసుల మేరకు తాను ఈరోజు విచారణకు హాజరుకానున్నట్టుగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో విచారణకు హాజరవ్వాలని మాత్రమే ఉందన్నారు. ఎటువంటి డాక్యుమెంట్స్, బ్యాంక్ లావాదేవీలు తీసుకొని రావాలని సూచించలేదని చెప్పారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తన ఇంట్లో దొరికిన నగదు గురించి ఐటీ అధికారులకు పూర్తి వివరాలు తెలియజేస్తానని అన్నారు. 

ఇటీవల ఐటీ అధికారులు రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించిన సంగతి  తెలిసిందే. ఈ సోదాల్లో ఐటీ అధికారులు దాదాపుగా రూ. 15 కోట్ల నగదు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

సోదాల అనంతరం మంత్రి మల్లారెడ్డితో మరో 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం (నవంబర్ 28) విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నేడు మల్లారెడ్డి ఐటీ విచారణకు దూరంగా ఉండనున్నారు. తాను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో విచారణకు వెళ్లడం లేదని  మల్లారెడ్డి చెప్పారు. అయితే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు సహా పలువురు ఈ రోజు ఐటీ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. 

ఇక, ఐటీ సోదాలు జరిగిన సమయంలో మర్రి రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సోదాలు విషయం తెలసుకుని ఇంటికి చేరుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ.. తాను, తన భార్య విదేశాల్లో ఉన్నామని, సోదాల విషయం తెలుసుకుని హడావుడిగా నగరానికి వచ్చానని చెప్పాడు. సోదాల్లో తన తండ్రి, తల్లి, కూతురితో ఐటీ అధికారులు అసభ్యంగా, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఐటీ అధికారులు తన నివాసం నుంచి రూ. 4 కోట్ల నగదు సీజ్ చేశారని చెప్పారు. బీజేపీలో చేరాలని తమపై ఒత్తిడి తెచ్చేందుకే దాడులు చేశారని ఆరోపించారు. మల్లారెడ్డితో తనకు ఎలాంటి ఆర్థిక, వ్యాపార లావాదేవీలు లేవని తేల్చి చెప్పారు.

‘‘నాకు సొంత కాలేజీలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. మల్లారెడ్డి గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదిలావుండగా.. విదేశాల్లో ఉన్నప్పుడు నా నివాసంపై దాడి చేసి.. 77 ఏళ్ల నా తండ్రి, కూతురితో అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి వారిని తమ వాహనాల్లో నా కళాశాలలకు, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. నా కుమార్తెతో పాటుగా మహిళా అధికారి ఎవరూ లేరు. ఐటీ దాడులకు నేను వ్యతిరేకం కాదు. వారు ఈ దాడులు చేసిన తీరుపై మాత్రమే నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను’’ అని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 

ఐటీ దాడులు తనకు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు సోదాలు సరైన రీతిలో జరిగాయని చెప్పారు. తమ ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలలో వివిధ కోర్సులకు కౌన్సెలింగ్ ఇటీవల ముగిసిందని.. కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజులను నగదు రూపంలో చెల్లించారని చెప్పారు. తాను గత 10 రోజులుగా విదేశాల్లో ఉన్నందున నగదు ఇంట్లోనే ఉందని చెప్పారు. 

click me!