అమ్మతోడు, రాజకీయాలకు బండ్ల గణేష్ ఇక దూరమే

By telugu teamFirst Published Jan 5, 2020, 8:53 PM IST
Highlights

సినీ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం లేదు. అమ్మతోడు అంటూ ఒట్టు పెట్టి మరీ సినిమాలు తప్ప మరో పనిచేయనని ఆయన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.

హైదరాబాద్: సినీ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇక రాజకీయాల్లో వేలు పెట్టే అవకాశం లేదు. తాను రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించబోనని ఆయన నర్మగర్భంగా చెప్పారు. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన ఆదివారం మాట్లాడారు. 

తాను ఇక సినిమాల్లోనే పనిచేస్తానని, మరో పని చేయనని ఆయన చెప్పారు. అమ్మతొడు అని ఒట్టు పెట్టి మరీ ఆ విషయం చెప్పారు. దీన్నిబట్టి ఆయన ఇక రాజకీయాల్లోకి రాబోరనే విషయం అర్థమవుతోంది. 2018 సెప్టెంబర్ లో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ పై పోటీ చేయాలని ఆశించారు. కానీ ఆయనకు టికెట్ లభించలేదు. అయితే, ఎన్నికల సమయంలో ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాన్ని సృష్టించాయి.

బండ్ల గణేష్ వివాదాలకు పెట్టింది పేరు. గణేష్ తమను కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఓ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పార్టీ నేత రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు కొందరు విజయవాడ జాయింట్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

సినీ రచయిత వక్కంతం వంశీ 2017 నవంబరులో హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశారు. ఈ కేసులో ఆయనకు ఆరు నెలలు కారాగార శిక్ష, 16 లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే, వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ లభించింది.

click me!