తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పోటీ చేయనున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పోటీ చేయనున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బండ్ల గణేష్ పోటీ చేయనున్నారని.. ఇందుకోసం ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారని, పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపారనేది ఆ ప్రచారం. అయితే దీనిపై బండ్ల గణేష్ స్పందించారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. తాను కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తన ధ్యేయమని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని బండ్ల గణేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు. కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం జై కాంగ్రెస్’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
undefined
తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు. ఈ క్రమంలోనే కొన్ని ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.