సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఎందుకోసమంటే..?

Published : Oct 09, 2022, 11:04 AM IST
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఎందుకోసమంటే..?

సారాంశం

పోలీస్ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.   

పోలీస్ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్ లేని ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని అన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కూడా  కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

‘‘ఇటీవల తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపునిచ్చి.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపునివ్వక పోవడాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఈ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు 20%, బీసీలకు 25%, జనరల్ అభ్యర్థులకు 30% కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయగలరు. 

ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపులివ్వకపోవడం వల్ల వారు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా.. ప్రిలిమ్స్‌లో 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు కాగలరు. రిజర్వేషన్ లేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టి అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేసింది. అయితే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపునివ్వకపోవడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను సవరిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్‌లో 25 శాతం అంటే 50 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu