
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయత్ర చేపడుతున్నారు. ఇటీవల మూడో విడత పాదయాత్రను ముగించిన బండి సంజయ్.. సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే నాలుగో విడత యాత్రను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడ్డాలో నిర్వహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సంజయ్ నాలుగో విడత యాత్ర చాలా భాగం కొనసాగేలా బీజేపీ శ్రేణులు రూట్ మ్యాప్‌ను రూపొందిస్తుంది.
కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ఒక్క ఇబ్రహీంపట్నం మినహా మిగతా ఏడు అసెంబ్లీ స్థానాలు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. నాలుగో విడత యాత్ర పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో సాగనుండగా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజున్న పాటు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రోజుకు 12 నుంచి 15 కి.మీ మేర యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు.
ఇక, బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలన్నదానిపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి నాయకుల సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో చిత్తారమ్మ అమ్మవారి ఆలయం లేదా సూరారంలోని కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి యాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని పలువురు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి వరకు మూడు విడుతలుగా యాత్ర సాగగా.. ప్రతిసారి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరోవైపు అబ్దులాపూర్ మెట్ ఓఆర్‌ఆర్ వద్ద యాత్రను ముగించాలనే ఆలోచన చేస్తున్నారు.
నాలుగో విడత పాదయాత్రలో.. జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో పార్టీలో మరింతగా బలోపేతం చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాగా వేసేలా ప్రణాళికలు రచిస్తుంది. అలాగే బండి సంజయ్ పాదయాత్ర నగరంలో సాగడం ద్వారా.. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ ప్రచారాన్ని ట్రాక్ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే పాదయాత్ర సమయంలో బీజేపీలోకి కొన్ని చేరికలు కూడా ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఇక, బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర మూడు విడతలలో కలిపి 1,121 కి.మీ మేర యాత్ర నిర్వహించారు. ఇందులో 18 జిల్లాల్లోని 41 అసెంబ్లీ నియోజకవర్గాలలో బండి సంజయ్ యాత్ర సాగించారు.