ఇబ్రహీంపట్నంలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్: మూడు రోజుల్లో నలుగురు మృతి, విచారణకు ఆదేశం

By narsimha lode  |  First Published Aug 30, 2022, 9:38 AM IST

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్  వికటించి మరో  ఇద్దరు మహిళలు  మృతి చెందారు.  దీంతో మృతి చెందిన మహిళల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 


 ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి  మరో ఇద్దరు మహిళలు మరణించారు. . కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు ఇద్దరు మహిళలు మృతి చెందారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది ప్రభుత్వం.   ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25 వ తేదీన 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు.  ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ నెల 28న ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 29న మరో మహిళ,ఇవాళ  ఇద్దరు మహిళలు మరణించారు. 

Latest Videos

undefined

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తైన తర్వాత మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, రాజీవ్ నగర్ తండాకు చెందిన మౌనిక,  మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపల్లికి చెందిన  లావణ్య లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. వాంతులు, విరోచనాలతో ఈ నలుగురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.  ఈ నలుగురికి రక్తపోటు గణనీయంగా పడిపోయినట్టుగా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. 

ఈ నెల 28న మమత, ఈ నెల 29న  సుష్మ,  ఇవాళ లావణ్య, మౌనికలు  చనిపోయారు..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  వారం రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించి నివేదిక  సమర్పించాలని ప్రభుత్వం కోరింది. ఈ ఘటనకు సంబంధించి ప్రజారోగ్య శాఖ ఉప సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్, ఉప వైద్యాధికారిణి నాగజ్యోతి ఆ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. 

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే విషయమై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ సమయంలో అనస్థీషీయా మోతాదుకు మించి ఇచ్చారా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న నలుగురు  మహిళలు మృతి చెందడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నాగార్జునసాగర్ -ఇబ్రహీంపట్నం రోడ్డుపై భారీగా పోలీసులను మోహరించారు.

click me!