
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదంటూ పాత నిజాంను నయా నిజాం అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్‌లో(ట్విట్టర్) పోస్టు చేశారు. ‘‘ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు.. తన కుక్కలను మొరుగుమని చెబుతాడు. కానీ కుక్కలు మొరుగుతూ ఉండగానే ఏనుగు నడుస్తూనే ఉంటుంది’’ అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.
కేసీఆర్ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నానని చెప్పుకునే పిచ్చి ఇంజనీర్ అని విమర్శించారు. మేఘాలు పేలినట్లు పేర్కొన్న చెడ్డ వాతావరణ శాస్త్రవేత్త అని విమర్శలు గుప్పించారు. పారాసిటమాల్, అధిక ఉష్ణోగ్రతలు కరోనా వైరస్‌ను నయం చేస్తాయని ఈ శాస్త్రవేత్త చెప్పారని సెటైర్లు వేశారు.
తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా రాకుండా చేసినందుకు కేసీఆర్‌ను నిందించాలని బండి సంజయ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం సమర్పించిన నివేదికలో నీటి కేటాయింపుల ప్రస్తావన లేదని.. ఇది క్లియరెన్స్ లోపానికి దారితీసిందని, జాతీయ హోదాను హరించిందని మండిపడ్డారు. 575 టీఎంసీల కృష్ణా నీటికి బదులు కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకుని ఒప్పందం కుదుర్చుకుని.. ఇప్పుడు ప్రధాని మోదీజీపై నిందలు వేస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యం కేసీఆర్ ఆజ్ఞపై పని చేయదని.. దానికి నియమాలు, విధానాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ అనారోగ్యంగా ఉండటానికి కారణాలు ఉన్నప్పటికీ.. మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అని, తెలంగాణలో ఆయన పర్యటిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీని ఘనంగా స్వాగతించారని.. బైబై కేసీఆర్ అని చెప్పారని బండి సంజయ్ పోస్టు చేశారు.