బిజెపి ఎంపీ బండి సంజయ్ వినాయక చవితి ఉత్సవాలపై కీలక ప్రకటన చేసారు. పండగ జరిగే నవరాత్రులు వినాయక మండపాల నిర్వహణ ఖర్చులో కొంత తాను భరిస్తానని తెలిపారు. ఆయన ఏ ఖర్చు భరించనున్నారంటే...
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ యూత్ లో మరీముఖ్యంగా హిందుత్వవాదుల్లో మంచి ఫాలోయింగ్ వుంది. కరీంనగర్ యువత సంజయ్ ను ఎంతగానో అభిమానిస్తుంటారు. ఆయన కూడా వారికి ఏ అవసరం వున్నా నేనున్నానంటూ ముందుంటారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కరీంనగర్ బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. తాజాగా వినాయక చవిత నేపథ్యంలో ఆనందంగా ఉత్సవాలు జరుపుకునే యువతను ఇబ్బంది పెట్టవద్దంటూ అధికారులకు కేంద్ర మంత్రి సంజమ్ ఆదేశించారు.
వినాయచవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి సంజయ్ హాజరయ్యారు. కమీషనర్ అవినాష్ మహంతితో పాటు పోలీస్, ఇతరశాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్చించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... వినాయక చవిత వేళ మండపాలను ఏర్పాటుచేసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేవారు నిష్టతో వుండాలని సూచించారు. వినాయకుడిని నవ రాత్రులు భక్తిశ్రద్దలతో పూజించాలి... మండప నిర్వహకులంతా ఉపవాస దీక్షలో వుండాలని సూచించారు. భక్తితో పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ... అందుకు తానే నిదర్శనమన్నారు. గత 30 ఏళ్లుగా నిత్యం భగవంతుని పూజిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
ప్రస్తుతం హిందూ సమాజంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది... దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే వుందన్నారు కేంద్ర మంత్రి. కాబట్టి వినాయక మండపాలవద్ద అపవిత్రమైన కార్యక్రమాలను నిర్వహించవద్దని ... అక్కడంతా ఆద్యాత్మిక వాతావరణం వుండేలా చూడాలన్నారు. అందులో భాగంగానే మండప నిర్వహకులు 9రోజుల ఉపవాసదీక్ష తీసుకోవాలని సూచించారు. వినాయకుడు చాలా పవర్ ఫుల్ దేవుడు... భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడని సంజయ్ తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలి. పోలీసులు, అధికారులు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదామని సంజయ్ సూచించారు.
గణేష్ మండపాల వద్ద నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు కేంద్ర మంత్రి. ముఖ్యంగా మండపాల వద్ద కరెంట్ సౌకర్యం కల్పించే విషయంలో విద్యుత్ శాఖ నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టొదని సూచించారు. నగరంలోని గణేష్ మండపాల నిర్వహణకు అయ్యే విద్యుత్ ఛార్జీలన్నీ నేనే చెల్లస్తాను... దయచేసి మండప నిర్వాహకులను బిల్లులు అడగొద్దని సూచించారు. గణేశ్ విగ్రహాలు తీసుకొచ్చే సమయంలో తీగలు అడ్డు ఉండకుండా ఈరోజు నుండే చర్యలు తీసుకోవాలని సంజయ్ ఆదేశించారు.
వినాయక నిమజ్జన ఉత్సవాల సమయంలో ప్రత్యేకంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు బండి సంజయ్ సూచించారు. ఇక నిమజ్జన వేడుకను చూసేందుకు వచ్చ భక్తులకు భోజన సదుపాయం కల్పించాలన్నారు. ఈ రెండు విషయాల్లో అవసరమైతే ప్రైవైటు ఆసుపత్రులు, హోటల్స్ అసోసియేషన్ నాయకుల సహకారం తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు గతంలో కంటే ఎక్కువ క్రేన్లు ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించాలన్నారు.మొత్తంగా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు.