వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
వరంగల్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
నిన్న నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద అవినీతిపరుడిగా ఆరోపణలు చేసింది. ఉద్యమం సమయంలో సుదర్శన్ రెడ్డి ఆస్తులెన్ని ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుదర్శన్ రెడ్డి ఆస్తులెన్నో చెప్పాలన్నారు. సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల బస చేసే బస్సును టీఆర్ఎస్ శ్రేణులు నిప్పంటించారు. అయితే వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఈ మంటలను ఆర్పివేశారు. టీఆర్ఎస్ శ్రేణుల తీరుపై వైఎస్ఆర్‌టీపీ తీవ్రంగా మండిపడింది. అనంతరం షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి.