తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటే.. తెలంగాణలో కమలం వికసించాలని మోదీ చెప్పారు: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published Dec 15, 2022, 6:14 PM IST
Highlights

కరీంనగర్ గడ్డా.. బీజేపీ అడ్డా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచి గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకు పుట్టాలని చెప్పారు. 

కరీంనగర్ గడ్డా.. బీజేపీ అడ్డా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచి గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకు పుట్టాలని చెప్పారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనబెట్టారని.. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అన్నారు. బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు చేశారు. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉద్యమకారులను పక్కనపెట్టిన కేసీఆర్ ద్రోహులను వెంటపెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ల్యాండ్, గ్రానైడ్, సాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని..దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు. కొందరు తనకు డిపాజిట్ రాదని.. ఎమ్మెల్యేగా కూడా గెలవనని హేళన చేశారని అన్నారు. కార్యకర్తల కష్టంతోనే తాను కరీంనగర్ ఎంపీగా గెలిచానని అన్నారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

హైకమాండ్ తనను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలేనని అన్నారు. కరీంనగర్‌లో కొట్లాడినట్టే రాష్ట్రమంతా కొట్లాడమని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చెప్పారని తెలిపారు. గడీల పాలన బద్దలు కొట్టేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. కరీంనగర్ స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా గడీలపాలనపై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై కమలం  జెండా వికసించేలా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పిందని తెలిపారు.

తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదని మండిపడ్డారు. మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన, కుటుంబ పాలనను అంతమొందిస్తామని అన్నారు. ప్రజలు, ధర్మం  కోసమే తమ పోరాటం అని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదారి  పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్దికి సహకరించడం లేదని మండిపడ్డారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఒక్కటేనని అన్నారు. దోచుకో, దాచుకో అనే పాలసీతో పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనుకుంటే.. జై ఆంధ్రా, జై తెలంగాణ అంటారని మండిపడ్డారు. సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. నిరూపేదలకు పక్కా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటిన జీతాలు ఇస్తామని తెలిపారు. ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

click me!