తమ పార్టీతో టీడీపీ పొత్తు ఊహజనితమేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఊహజనితమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో శనివారం నాడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుల గురించి చర్చ జరిగిందని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఆదివారంనాడు హైద్రాబాద్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఊహజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో మమత బెనర్జీ , స్టాలిన్, నితీష్ కుమార్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలను,ప్రజలను కలవకుండా ఉండే పార్టీ బీజేపీ కాదన్నారు.. కేసీఆర్ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని ఆయన తెలిపారు.
2014 ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీతో టీడీపీ పొత్తును కోరుకుంటుందనే సంకేతాలు ఇస్తుంది. ఈ తరుణంలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబునాయుడు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
also read:త్వరలోనే తెలంగాణ నుండి కేసీఆర్ ను తరిమికొట్టే రోజొస్తుంది: ఈటల
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయుడు బీజేపీ అగ్రనేతలతో సమావేశం కావడం రాజకీయ చర్చకు కారణమైంది.