
నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిగినట్టుగా వార్తలు రావడం మరింత కలకలంగా మారాయి. ఈ క్రమంలోనే స్పందించిన సిక్కిరెడ్డి తల్లి మాధవి.. ఆ వార్తలను తోసిపుచ్చారు. కేపీ చౌదరి తమకు తెలిసి వ్యక్తి మాత్రమేనని చెప్పారు. అతను ఎలాంటి వాడో తమకు తెలియదని స్పష్టం చేశారు. 2011లో తాము అత్తాపూర్‌లో ఉండేవాళ్లమని.. అక్కడ తాము ఉండే అపార్ట్‌మెంట్‌లోనే కేపీ చౌదరి నివాసం ఉండేవాడని తెలిపారు. అప్పుడు కేపీ చౌదరితో తమకు పరిచయం అని చెప్పారు. 2013లో తాము మాదాపూర్‌కు షిప్ట్ అయ్యామని తెలిపారు.
అప్పటి నుంచి కేపీ చౌదరితో తమకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. అయితే అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడేవాడని తెలిపారు. 2019లో సిక్కిరెడ్డి పెళ్లికి కూడా వచ్చాడని.. తెలిసిన వ్యక్తి కావడంతో తాము ఆహ్వానించామని చెప్పారు. అయితే కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నట్టుగా తెలిసిందని తెలిపారు. గతంలో ఉన్న పరిచయం కారణంగా వారం రోజులు ఉండేందుకు కేపీ చౌదరికి తాను ఇళ్లు షెల్టర్‌కు ఇచ్చామని చెప్పారు. కేపీ చౌదరికి ఇళ్లు ఇస్తున్నట్టుగా సిక్కిరెడ్డికి కూడా చెప్పడం జరిగిందని అన్నారు. అయితే కేపీ చౌదరి ఇలాంటి వాడని మాత్రం తమకు తెలియదని చెప్పారు. కేపీ చౌదరిని ఆ ఇంట్లో ఉండమని తానే చెప్పడం జరిగిందని అన్నారు. ఆ ఇళ్లు సిక్కిరెడ్డి పేరు మీద ఉందని.. అందుకే ఈ సమస్య అని చెప్పారు.
సిక్కిరెడ్డి బయటకు ఎక్కడికి వెళ్లినా తన భర్తతోనే వెళ్తుందని ఆమె తల్లి చెప్పారు. ఆమె గేమ్ కోసం చాలా కష్టపడుతుందనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇక, ఏప్రిల్ చివర నుంచి సిక్కిరెడ్డి సరిగా ఇక్కడ ఉండటం లేదని.. బిజీ షెడ్యూల్‌తో వివిధ టోర్నమెంట్స్‌లో ఆడుతుందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తమని అన్నారు.
తెలిసిన వ్యక్తిగా ఒకటి రెండు సార్లు కేపీ చౌదరితో సిక్కిరెడ్డి మాట్లాడి ఉండొచ్చని అన్నారు. కేపీ చౌదరిని అంకుల్ అని పిలుస్తోందని చెప్పారు. సిక్కిరెడ్డి ఇళ్లును పార్టీకి వాడారని మాత్రమే చెబుతున్నారని.. సిక్కిరెడ్డి డ్రగ్స్ వాడినట్టుగా కేపీ చౌదరి ఎక్కడ చెప్పలేదని అన్నారు. సిక్కి ఇంట్లో పార్టీలు జరిగినట్టుగా మాత్రం తెలియదని.. ఇక్కడ పార్టీలు జరిగేందుకే అవకాశమే లేదని చెప్పారు. కేపీ చౌదరి పార్టీ నిర్వహించి ఉంటే అక్కడి వారు తమకు చెప్పేవారని తెలిపారు. ఇక, డ్రగ్స్ తీసుకున్నట్టుగా, గోవాకు వెళ్లి పార్టీల్లో పాల్గొన్నట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని కూడా ప్రశ్నించారు. అవాస్తవాలు ప్రచారం చేయద్దని అన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి పోరాటాకైనా సిద్దమని చెప్పారు.