ప్రజా శాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ ఆయనను పార్టీలోకి స్వాగతించిన విషయం విదితమే. వరంగల్ ఎంపీ అభ్యర్థిగాను బాబు మోహన్‌ను కేఏ పాల్ ఇది వరకే ప్రకటించారు. తాజాగా బాబు మోహన్‌కు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనను పార్టీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రకటించారు.
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్ వ్యవహరిస్తారని కేఏ పాల్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అలాగే.. తెలంగాణలో 17 స్థానాల్లోనూ ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని వివరించారు. బాబు మోహన్ పార్టీలో చేరిన తర్వాత చాలా మంది నాయకులు ప్రజా శాంతి పార్టీలో చేరడానికి వస్తున్నారని తెలిపారు.
తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనా ఆయన విమర్శలు కురిపించారు. వందేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇక బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంక్ లేదని అన్నారు.