పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్

By narsimha lode  |  First Published Mar 25, 2024, 2:17 PM IST


పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్  ఆదేశించారు.



హైదరాబాద్: పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు  తప్పవని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వి.హనుమంతరావు, నిరంజన్ లు ఇటీవల కాలంలో  పార్టీ అంతర్గత విషయాలపై  బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.ఈ తరుణంలో  మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన ప్రస్తుతం  రాజకీయంగా చర్చకు దారి తీసింది.  

ఏదైనా అంశాలపై పార్టీ అంతర్గత వేదికపైనే చర్చించాలని  మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.పార్టీకి వ్యతిరేకంగా  మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ఎంతటి సీనియర్ నేత అయినా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.

Latest Videos

లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుతో పాటు  ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో నేతలను చేర్చుకోవడంపై  కూడ ఈ ఇద్దరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  వి.హనుమంతరావు ఎంపీ టిక్కెట్టును ఆశిస్తున్నారు. అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పలువురు నేతలు టిక్కెట్టును ఆశిస్తున్నారు. ఖమ్మం నుండి పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.  వారం రోజుల్లోపుగా మిగిలిన స్థానాల్లో  కూడ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను ప్రకటించనుంది.

ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుండి నేతలను చేర్చుకోవడంపై  కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై  వ్యాఖ్యలు చేయడంపై  కాంగ్రెస్ నాయకత్వం  అసంతృప్తిగా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.



 

click me!