మెడిసిన్ చదవాలనుకుంటే ఎంబీబీఎస్ లో సీటు రాకుండా ఆయుర్వేదం చదవాల్సి రావడంతో ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక ఒత్తిడి కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ విద్యార్థి పేరుజగదీష్ (23). నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జి.డి. మాణిక్యప్ప కుమారుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. జగదీష్ పెద్ద కుమారుడు. అతనికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు.
చిన్నప్పటినుంచి జగదీష్ కు ఎంబిబిఎస్ మీద ఆసక్తితో.. నిరుడు నీట్ ఎంట్రెన్స్ రాశాడు. ఈ ఎగ్జామ్స్ లో ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద కాలేజీలో బిఎంఏఎంఎస్ లో చేరాడు. తన స్నేహితుడైన ఫణీంద్రతో కలిసి వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. అయితే, తాను కోరుకున్న ఎంబిబిఎస్ లో సీటు రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. బిఏఎంఎస్ చేయడం ఇష్టం లేక.. కాలేజీకి కూడా సరిగా వెళ్లకపోయేవాడు.
మాజీ ఐఆర్ఎస్ పై హనీట్రాప్.. వందకోట్లు కాజేయాలని.. పనిమనిషితో పెళ్లికి మాస్టర్ ప్లాన్.. చివరికి...
ఈ క్రమంలోనే సంవత్సరం గడిచిపోయి పరీక్షలు దగ్గర పడ్డాయి. మొదటి సంవత్సరం బిఏఎంఎస్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్నట్లుగా నోటీసు వచ్చింది. అయితే, కోర్సు చేయడం ఇష్టం లేక కాలేజీకి వెళ్లకపోవడంతో హాల్ టికెట్ రావడం ఇబ్బందిగా మారింది. తను కాలేజీకి వెళ్లకపోవడం వల్ల హాల్ టికెట్ ఇవ్వరేమోనని.. పరీక్షలు రాయలేకపోతానని ఒత్తిడికి గురయ్యాడు.
ఈ రెండు రకాల ఒత్తిళ్లతోనే బుధవారం ఉదయం జగదీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం నాడు ఉదయం జగదీష్ రూమ్మేట్ ఫణీంద్ర…తన స్నేహితుడైన రాజకుమార్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటల సమయంలో జగదీష్.. తన స్నేహితుడైన అజయ్ కు వాట్సప్ లో ఓ మెసేజ్ పెట్టాడు. తాను చనిపోతున్నట్లుగా ఆ మెసేజ్ లో తెలిపాడు. అది చూసిన అజయ్ ఆందోళన పడ్డాడు.
వెంటనే జగదీష్ కు కాల్ చేయగా... ‘నేను చచ్చిపోతున్నా..’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో కంగారు పడ్డ అజయ్ వెంటనే మరో స్నేహితుడైన నవీన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. నవీన్ జగదీష్ రూమ్మేట్ అయిన ఫణింద్రకు చెప్పడంతో.. నవీన్, ఫణీంద్ర, ప్రశాంత్ కలిసి… జవహర్ నగర్ లోని జగదీష్ రూమ్ కి వచ్చారు.. అప్పటికే జగదీష్ రూమ్ లో ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే అతడిని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
ఈ విషయాన్ని జగదీష్ తండ్రి మాణిక్యపకు తెలియజేశారు. ఆయన నారాయణపేట నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. కొడుకు మృతి మీద మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతి మీద అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నాడు.