
తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలోనే నిర్వహించేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా భద్రతా చర్యలు కూడా పటిష్టం చేసింది. కాగా.. ఈ పంద్రాగస్టు వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు పోలీసులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ మల్లింపులు ఇలా ఉన్నాయి...
బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రాందేవ్‌గూడ–గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం 7:30–10గంటల వరకు ఈ రూట్‌లోకి అనుమతిస్తారు.
సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్‌టర్న్ తీసుకొని బాలికా భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడ వారికి కేటాయించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేయాలి.
రాజ్‌భవన్ రోడ్డులో...
రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాజ్‌భవన్ రూట్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదని అదనపు సీపీ సూచించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకకు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్–1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత వీటిని కేటాయించిన స్థలంలో పార్కు చేయాలి.
పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు గేట్–3 నుంచి లోపలికి వెళ్లి అక్కడే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గినవారు గేట్–3 వద్ద ఆగి ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
సికింద్రాబాద్‌లో...
పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్‌సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉంటాయి.