వనస్థలిపురంలో భార్యను హత్య చేసి, పారిపోయిన భర్తను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. భార్య వేరకొరితో సన్నిహితంగా ఉంటోదనే అనుమానంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం జరగ్గా.. తాజాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. అంజనపురి కాలనీలో 40 ఏళ్ల బాలకోటయ్య 32 ఏళ్ల శాలిని అనే దంపతులు నివసిస్తుండేవారు. ఈ దంపతులకు 2008లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలకోటయ్య భవన నిర్మాణ కాంట్రాక్టర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంత కాలం నుంచి భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను వేధింపులకు గురి చేస్తూ, శారీరకంగా కూడా దాడికి పాల్పడ్డాడు.
ఇది తట్టుకోలేక ఆమె శాతవాహన నగర్‌లో ఉండే తన తల్లిదండ్రులకు పిల్లలను తీసుకొని వెళ్లింది. వారితోనే కలిసి జీవించండం ప్రారంభించింది. అయితే బాలకోటయ్య కూడా వారి దగ్గరికే వచ్చి ఉండటం మొదలుపెట్టాడు. గత శుక్రవారం శాలిని తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే శుక్రవారం రాత్రి షాలిని స్కూటీపై వేరే ప్రదేశానికి వెళ్లారు. దీనిని గమనించి బాలకోటయ్య ఆమెను ఫాలో అయ్యారు. వనస్థలిప్రంలోని విజయపురి కాలనీలో సమీపంలో భార్య స్కూటీను ఢీకొట్టి, అడ్డగించాడు. అక్కడే ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో ఆగ్రహంతో భార్య తలపై బండరాయితో మోదాడు. అయినా బాధితురాలు కదలడానికి ప్రయత్నించిందని గుర్తించిన అతడు మళ్లీ ఆమెపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో స్థానికులు కొందరు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ బైక్ పై అతడు వేగంగా వెళ్లిపోయాడు. అనంతరం నిందితుడు బైక్‌ను వదిలేసి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లాడు. ఆదివారం తిరిగి నగరానికి వచ్చిన పోలీసులకు పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిసింది.
పోలీసుల బాలకోటయ్యను విచారించగా.. కొంత కాలంగా భార్యతో తనకు వివాదాలు ఉన్నాయని చెప్పారు. తన ఆస్తులను భార్య పేరు మీదికి మార్చుకుందని తెలిపాడు. ఆమె ఇతరులతో సన్నిహితంగా మెలిగేదని, ప్రవర్తన మార్చుకోవాలని చెప్పినా వినలేదని, అందుకే హత్య చేశానని వెల్లడించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎల్‌బి నగర్) బి సాయి శ్రీ తెలిపారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన బండరాయి, బైక్, ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.