తాజా మాజీ మంత్రుల భార్యల ఆస్తులకు రెక్కలు

By pratap reddyFirst Published Nov 19, 2018, 6:21 PM IST
Highlights

తాజా మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మొత్తం చరాస్తుల విలువ 2014లో రూ.17.98 లక్షలు కాగా ప్రస్తుత ఎన్నికల నాటికి, అంటే 2018నాటికి రూ.32.22 లక్షలకు చేరుకున్నాయి. ఇది ఈటెల రాజేందర్ తన నామినేషన్ తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం. 

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజా మాజీ మంత్రులు, ఇతర నేతల భార్యల ఆస్తులు ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయాయి. టీఆర్ఎస్ నేతల ఆస్తులు పెద్దగా పెరగలేదు గానీ వారి భార్యల ఆస్తులు మాత్రం పెద్ద యెత్తున పెరిగాయి. 

తాజా మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మొత్తం చరాస్తుల విలువ 2014లో రూ.17.98 లక్షలు కాగా ప్రస్తుత ఎన్నికల నాటికి, అంటే 2018నాటికి రూ.32.22 లక్షలకు చేరుకున్నాయి. ఇది ఈటెల రాజేందర్ తన నామినేషన్ తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం. 

ఈటెల రాజేందర్ భార్య ఆస్తుల విలువ 2014లో రూ70.04 లక్షలు కాగా, గత నాలుగేళ్లలో రూ.14.55 కోట్లకు చేరుకుంది. ప్రధానమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తుల విలువ పెరిగినట్లు ఆయన చూపించారు. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ స్థిరాస్తుల విలువ రూ. 4.93 కోట్లు కాగా 2018 నాటికి అది 12.50 కోట్లకు చేరుకుంది. 

ఇదిలావుంటే, సికింద్రాబాదు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రి టి. పద్మారావు చరాస్తుల విలువ రూ.5 లక్షల నుంచి రూ.2.18 కోట్లకు చేరుకుంది. పద్మారావు భార్య గృహిణి. ఆమె చరాస్తుల విలువ 2014లో 20.18 లక్షలు ఉండగా, 2018 నాటికి రూ.42.53 లక్షలకు చేరుకుంది. ఆమెకు 2014 నాటికి స్థిరాస్తులేవీ లేవు. కానీ 2018 నాటికి రూ.36 లక్షల విలువ చేసే స్థిరాస్తులను సంపాదించుకున్నారు. 

వివాదాస్పద టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన చరాస్తుల విలువ 2014లో రూ.2.76 లక్షలు కాగా ప్రస్తుతం ఆయనకు రూ.44 లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య చరాస్తుల విలువ 2014లో 2.33 కోట్లు ఉండగా, 2018 నాటికి రూ.3.25 కోట్లకు చేరుకుంది. 

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థిరాస్తుల విలువ 2014లో 24 కోట్లు ఉండగా, 2018 నాటికి వాటి విలువ రూ.3.25 కోట్లకు చేరుకుంది. ఆయన భార్య స్థిరాస్తులు 2014, 2018 మధ్య కాలంలో రూ. 9 కోట్ల నుంచి రూ.10.30 కోట్లకు చేరుకున్నాయి. 

click me!