బాబు తోక పట్టుకుని తిరిగారు: పవన్‌పై వెల్లంపలి సీరియస్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 26, 2019, 5:14 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇసుక రవాణాపై జగన్ పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వారిద్దరు తిప్పికొట్టారు. 

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అధికారం లేకుండా ఉండలేరని, అందుకే అధికారంలోకి రాకపోవడంతో ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తోక పట్టుకుని తిరిగారని వ్యాఖ్యానించారు. 

ఇప్పుడు పవన్ కల్యాణ్ దృష్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ మోడీపై పడిందని, ఎలాగైనా మోడీని కలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదే పదే విమర్శిస్తే ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నారని ఆయన అన్నారు. ఇసుక రవాణాపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. 

గత కొన్ని రోజులుగా పెద్ద యెత్తున వరదలు రాడంతో 50 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచే ఉన్నాయని, బ్యారేజీలోకి వరద పోటెత్తుతుండడంతో ఇసుక తీయడం సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. ఇసుకును తగిన ధరకు అందించేందుకు సిఎం జగన్ కృషి చేస్తున్నారని, పథకాలు అందించే తరుణంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని, వాటిని పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

సిఎం వైఎస్ జగన్ నాలుగు నెలల పాలనను సహించలేకనే పవన్ కల్యాణ్, టీడీపీ నేత బుద్దా వెంకన్న అక్కసు వెల్లగక్కుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఇసుక కొరత గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఒక్కసారి ప్రకాశం బ్యారేజీ సందర్శించాలని అన్నారు. 

గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరిగితే ఒక్కసారి కూడా స్పందించని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం పని కట్టుకుని విమర్శిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై ఒక్కసారి కూడా నోరు మెదపని పవన్ కల్యాణ్ ఈ అంశంపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

click me!