మర్రిగూడ మండలం అంతంపేటలో ఓటువేసేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నారు.కొందరికే డబ్బులిచ్చారని ఓటుహక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు.
మర్రిగూడ: మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో ఓటు వేసేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నారు. గ్రామంలో కొందరికే డబ్బులిచ్చారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓటుహక్కును వినియోగించుకొనేందుకు నిరాకరిస్తున్నారు.డబ్బులుఅందరికి చెల్లించాలని కోరుతున్నారు.ఈ విషయమై ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో మొత్తం 2 వేల మంది ఓటర్లుంటే ఇప్పటివరకు కేవలం 200 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. డబ్బులిస్తేనే ఓటు హక్కును వినియోగించుకొంటామని ఓటర్లు మొండికేశారు.ఇదే డిమాండ్ తో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తమకే ఓటు వేయాలని కోరుతూ కొన్ని పార్టీలు డబ్బులు పంచినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అంతంపేటలో కూడ కొందరికే డబ్బులు రావడంతో డబ్బులు రానివారునిరసనకు దిగారు. ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం డబ్బులు తీసుకున్నాఇచ్చినా నేరమే. అయినా పార్టీలువిచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు.
also read:42 మంది స్థానికేతరుల్ని పంపించాం, రూ.2.99 లక్షల నగదు సీజ్:తెలంగాణ సీఈఓవికాస్ రాజు
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.