మునుగోడు బై పోల్.. పోలింగ్ జరుగుతున్న వేళ భారీగా నగదు పట్టివేత..

By Sumanth KanukulaFirst Published Nov 3, 2022, 12:53 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా పార్టీల ప్రలోభాలు ఆగడం లేదు.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా పార్టీల ప్రలోభాలు ఆగడం లేదు. ఓ వైపు పోలింగ్ కొనసాగుతున్న వేళ.. నియోజకవర్గంలోని పలు చోట్ల ఓటర్లకు డబ్బు పంపిణీ కొనసాగుతుంది. అయితే  కొన్నిచోట్ల పోలీసులు వాటిని అడ్డుకుంటున్నారు. అయితే నాంపల్లి మండలంలో భారీగా నగద్దు పట్టుబడింది. న‌ల్ల‌గొండ జిల్లా నాంప‌ల్లి మండ‌లం మ‌ల్ల‌పురాజిప‌ల్లిలో రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దును కారులో త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల సోదాలు నిర్వ‌హించి స్వాధీనం చేసుకున్నారు. 

కారులో ఉన్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే కారులో టీఆర్ఎస్‌ నేతలు నగదు తరలిస్తున్నాని బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా డబ్బు పట్టుబడినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు యువత కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 

మునుగోడు నియోజకవర్గం నుంచి స్థానికేతరులను పంపించి వేశామని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. మునుగోడులో నాన్‌ లోకల్‌ను గుర్తించి ఆరుగురిపై కేసులు నమోదు పెట్టామని తెలిపారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టుగా వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని వెల్లడించారు. ఓటు వేయడానికి డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నేరమేనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగిందని తెలిపారు. పోలీసులు వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారని చెప్పారు. ఇక, కేంద్ర ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్‌ను పర్యవేక్షించారు.

click me!