మాదాపూర్ డ్రగ్స్ కేసు : మరో ఇద్దరికి ముందస్తు బెయిల్.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు త్వరలో నోటీసులు..?

Siva Kodati | Published : Sep 21, 2023 7:22 PM
Google News Follow Us

సారాంశం

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కలహర్ రెడ్డితో పాటు స్నార్ట్ పబ్ యజమానికి ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్ట్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కొందరు సినీ, రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరికి కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కలహర్ రెడ్డితో పాటు స్నార్ట్ పబ్ యజమానికి ముందస్తు బెయిల్ ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీరిద్దరిని సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్ కావాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ కేసులో కొందరు సినీ, రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. ప్రధానంగా హీరో నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్‌లతో కాంటాక్ట్ అయినవారికి నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నవదీప్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నవదీప్‌ను ప్రశ్నించాక మరికొందరికి నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ విభాగం భావిస్తోంది.

అంతకుముందు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నవదీప్ ఇంటి వద్ద ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 23వ తేదీన హెచ్-న్యూ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్‌ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నార్కొటిక్‌ బ్యూరో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నవదీప్‌ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. 

నవదీప్‌కు 41ఏ నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు:

ఇటీవల డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కొడుకు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నవదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పటికే కస్టడీలో ఉన్న స్నేహితుడు రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసుల తెలిపారు. 

ALso Read: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో నోటీసులు.. వివరాలు ఇవే..

మరోవైపు నవదీప్ ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. అయితే ఇరువైపుల న్యాయవాదనలు విన్న న్యాయస్థానం.. నవదీప్‌కు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి.. విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.