బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..

By Sairam IndurFirst Published Mar 20, 2024, 6:30 PM IST
Highlights

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వైదొలుగుతున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటున్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్.. ఆ పార్టీని వీడారు. 

ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధిష్టానానికి తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ ను వీడుతున్నానని అందులో పేర్కొన్నారు. 17 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో కొనసాగానని ఆయన తెలిపారు. ఈ సమయంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో కూడా విడుదల చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గోడం నగేష్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు కూడా ఇటీవల బీఆర్ఎస్ ను వీడారు. వారంతా గత ఆదివారం రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ కూడా బీజేపీలో చేరారు. 

ఈ పరిణామాలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కాళీ అవుతున్నట్టు అర్థమవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల కంటే ముందు వరకు బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కంచుకోటగా ఉండేది. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోయారు. బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో వారిద్దరూ వేరే పార్టీలో చేరారు. దీంతో ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. 

click me!