మేడ్చల్ లో బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే...

By SumaBala Bukka  |  First Published Oct 18, 2023, 2:15 PM IST

మేడ్చల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పార్టీ వీడనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరనున్నారు. 


మేడ్చల్ : తెలంగాణలో ఎన్నికలవేళ అనేకం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరో నేత బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. బుధవారం నాడు సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో  టిఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లో మలిపెద్ది సుధీర్ రెడ్డికి సీటు దక్కలేదు. ఆయన స్థానంలో అధిష్టానం మల్లారెడ్డిని బరిలోకి దింపింది. అప్పటికి మల్లారెడ్డి పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి అసెంబ్లీ బరిలోకి దింపి, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకుంది.

Latest Videos

పవన్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతు కోసం మంతనాలు..!!

ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మల్లారెడ్డి  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు బాగా దగ్గరయ్యారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని అతనికి కేటాయించడం.. అధిష్టానంతో దగ్గర అవడంతో మల్లారెడ్డికి, సుధీర్ రెడ్డికి మధ్య  తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు.

మలిపెద్ది సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి ల మధ్యలో ఉన్న విభేదాల నేపథ్యంలో…సుధీర్ రెడ్డి  అసంతృప్తిని చల్లార్చినందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అప్పట్లో చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డికి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, అతని కొడుకు శరత్ చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కేలా ప్రయత్నం చేశారు. 

ఈ అసంతృప్తితోనే అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు సుధీర్ రెడ్డి. ఈ క్రమంలో 2023 ఎన్నికల ప్రకటన వెలువడటం,  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సుధీర్ రెడ్డి  లేకపోవడం.. అక్కడ కొనసాగే విషయంలో ఆయన మల్లాగుల్లాలు పడుతుండడం..  వీటిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవాలనుకుంది. మరోవైపు సుధీర్ రెడ్డి కూడా.. ఇక బీఆర్ఎస్ లో ఎంత కాలం ఉన్నా.. మళ్ళీ ఎమ్మెల్యే కాలేనని అనుకుంటున్నట్లుగా…మేడ్చల్ నియోజకవర్గంలో తన పట్టు సాధించలేనని భావిస్తున్నట్లుగా సమాచారం. 

మల్లిపెద్ది సుధీర్ రెడ్డికి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి  బంధుత్వం కూడా ఉంది. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం విషయంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఊహాగానాలు వెలబడుతున్నాయి. కానీ, సుధీర్ రెడ్డి మాత్రం తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ లోకి వస్తానని తేల్చి చెప్పారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గంలో హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్, నక్కా ప్రభాకర్ గౌడ్ లాంటి  నేతలు పోటీపడుతున్నారు.

ఇక మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తనకు టికెట్ ఇస్తే మేడ్చెల్ లో విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల దగ్గర ఢంకా బజాయిస్తున్నట్లుగా సమాచారం. ఆ నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతో పాటు రెడ్డి సామాజిక వర్గం, ఇప్పటివరకు తాను టిఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి.. తన కోటలోని ఆ ఓట్లు తనకే పడతాయని.. ఆ నియోజకవర్గంలో నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న మిగతా నేతలకు ఈ అవకాశాలు లేవని  విశ్లేషించి చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

click me!