పవన్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతు కోసం మంతనాలు..!!

By Sumanth Kanukula  |  First Published Oct 18, 2023, 2:04 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. వివరాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని పవన్‌ను కోరారు. అయితే జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ నాయకుల కోరిక మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని పవన్ బీజేపీ నాయకులకు తెలియజేసినట్టుగా జనసేన పార్టీ తెలిపింది. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 

Latest Videos

undefined

ఇక, ప్రస్తుతం ఎన్డీయేలో జనసేన భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్దమైనట్టుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణ జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా ? అనే విషయంపై జన కార్యకర్తల, నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అభిప్రాయాన్ని తాము గౌరవించామని ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు పవన్కు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్టు చేసేందుకు పోటీ నుంచి తప్పుకున్నామని..కానీ ఈ సారి తప్పనిసరిగా పోటీచేయవలసిందేనని డిమాండ్ చేశారు. చాలా రోజుల నుంచి ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని.. ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సారి విరమించుకుంటే.. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలనని, అయితే తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని పవన్ చెప్పినట్టుగా సమమాచారం. 

click me!