హైదరాబాద్ లో మరో పోలీసుకు కరోనా, ఎలా సోకిందో అంతుబట్టని వైనం!

By Sree s  |  First Published May 2, 2020, 2:42 PM IST

రాచకొండ కమిషనరేట్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 25 సంవత్సరాల యువ కానిస్టేబుల్ కరోనా పాజిటివ్ గా తేలాడు. 


ప్రజలను ఈ కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు లాక్ డౌన్ అమలుపర్చడంలో పోలీసులు ముందున్నారు. ఇలా ప్రాజాసేవలో నిమగ్నమయి ఉన్నవారికి కూడా కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా రాచకొండ కమిషనరేట్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 25 సంవత్సరాల యువ కానిస్టేబుల్ కరోనా పాజిటివ్ గా తేలాడు. 

గత వారం రోజులుగా అతడు విధులకు హాజరవకపోతుండడంతో.... అతనిగురించి వాకబు చేయగా, ఇలా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపాడు. అనుమానం వచ్చి అతడి నమూనాలను పరీక్షలకు పంపడంతో... కరోనా పాజిటివ్ గా తేలాడు. 

Latest Videos

undefined

అతడికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ కానీ, ఏ కరోనా పేషెంట్ తో కాంటాక్ట్ గాని లేదు. అతడి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ లో ఉండమని అధికారులు ఆదేశించారు. 

అతడు పనిచేస్తున్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోని మిగితా పోలీసులకు కూడా టెస్టులు నిర్వహించారు. లక్షణాలున్న కొద్దిమందిని ఇండ్లలోనే క్వారంటైన్ లో ఉండమని ఉన్నతాధికారులు ఆదేశించారు. 

ట్రావెల్ హిస్టరీ కానీ, ప్రైమరీ కాంటాక్ట్ కానీ లేకపోవడంతో అతడికి ఈ వైరస్ ఎలా సోకి ఉంటుందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. అతడు అంబర్ పేటలో నివాసముండే ప్రాంతంలో పూర్తిగా శానిటేషన్ నిర్వహించారు. 

ఇకపోతే... తెలంగాణలో గత 24 గంటల్లో కేవలం 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1040కి చేరుకుంది. ఈ రోజు 22 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 552 ఉన్నాయి.

 తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఈటెల రాజేందర్ శుక్రవారం సాయంత్రం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసిఎంఆర్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. టెస్టులు తక్కువ చేస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. లాక్ డౌన్ ను పూర్తిగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. 

కరోనా లక్షణాలు ఉంటేనే ఆస్పత్రుల్లో చికిత్స చేయాలని ఐసిఎంఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి, కింగ్ కోఠి, గాంధీ ఆస్పత్రులను కేంద్రం పరిశీలించిందని ఆయన చెప్పారు. ఆస్పత్రులను పరిశీలించిన తర్వాత రాష్ట్రం తీసుకున్న చర్యలు కేంద్ర బృందం ప్రశంసించిందని ఆయన చెప్పారు.

click me!