అమెజాన్‌ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్.. భాగ్యనగరి మెడలో మణిహారం

By Siva KodatiFirst Published Aug 21, 2019, 12:27 PM IST
Highlights

చారిత్రక సంపదతో పాటు అనేక బహుళజాతి సంస్థలకు కేంద్ర స్థానంగా వున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భాగ్యనగరిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌‌ బుధవారం ప్రారంభంకానుంది. 

చారిత్రక సంపదతో పాటు అనేక బహుళజాతి సంస్థలకు కేంద్ర స్థానంగా వున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భాగ్యనగరిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌‌ బుధవారం ప్రారంభంకానుంది.

పూర్తిగా ఆధునిక నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు. ఇందులో సుమారు 15 అంతస్తులలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీని నిర్మాణం చేపట్టారు. అమెజాన్‌కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ సంఖ్య 10 వేలకు చేరనుంది.

అమెజాన్ సంస్థ పదేళ్ల క్రితమే హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను నిర్మించాలని నిర్ణయించింది.

దీనికి తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది. 2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బిజినెస్ డెవలప్‌మెంట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు ఈ క్యాంపస్‌ కేంద్రం కానుంది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలను నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నడుపుతున్నాయి.

తాజాగా అమెజాన్ క్యాంపస్‌ ప్రారంభోత్సవం తర్వాత తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు ఊతం లభిస్తుంది. మరిన్ని సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకునే వీలుందని నిపుణులు భావిస్తున్నారు. 
 

click me!