మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు .ఇవాళ సాయంత్రానికి ఎన్నికల సామాగ్రితో అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
నల్గొండ:రేపు జరిగే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ను పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ,నాడు సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. చండూరులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అధికారులు అందిస్తున్నారు. తమకు అందించిన ఎన్నికల సామాగ్రిని పోలింగ్ సిబ్బంది మరోసారి చెక్ చేసుకొని పోలింగ్ కేంద్రాలకు బయలు దేరనున్నారు..డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం తర్వాత తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగుతుంది.ఈ నియోజకవర్గంలో 2,41,855మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఒక్కో పోలింగ్ కేంద్రంంలో ఐదుగురు పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1199 మందిని పోలింగ్ విధులకు కేటాయించారు.అదనంగా 300 మంది సిబ్బందిని రిజర్వ్ లో ఉంచారు.పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 199 మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఈసీ.50 ఫ్లయింగ్ స్క్వాడులను నియమించింది ఈసీ.
ఇప్పటి వరకు రూ.6.80 కోట్ల లెక్క చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.185 కేసులను పోలీసులు నమోదు చేశారు. నియోజకవర్గంలోని 119 బెల్ట్ షాపులను పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని 34 శాతం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు .ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసులను మోహరించారు.
పోలింగ్ ను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో ఉ‘న్న 298 పోలింగ్ కేంద్రాల్లో 35 అర్బన్ పోలింగ్ కేంద్రాలు. మిగిలినవన్నీ రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలే.
మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు.