తెలంగాణలో బిసిల కోసం ప్రత్యేక పార్టీ...: ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Jul 30, 2021, 10:21 AM IST
Highlights

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిసిల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరముందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సూచించినట్లు ఆయన తెలిపారు. 

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో బిసిల కోసం ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ పెట్టాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సూచించినట్లు బిసి సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బిసి వాదం బలంగా వున్న నేపథ్యంలో పార్టీ పెట్టి బిసిల అభ్యున్నతికి పాటుపడాలని అఖిలేష్ యాదవ్ సూచించినట్లు కృష్ణయ్య తెలిపారు. 

గురువారం ఢిల్లీలో బీసీ సంఘం నేతలతో కలిసివెళ్లి మాజీ సీఎం అఖిలేశ్‌ను కలిశారు ఆర్‌.కృష్ణయ్య. పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టడానికి చొరవ తీసుకోవాలంటూ ఆయనకు బిసి సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాస్సేపు బిసి సంఘం నాయకులతో మాట్లాడిన అఖిలేష్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి ముచ్చటించారు. బిసిలు అధికంగా గల ఇరు రాష్ట్రాల్లోనూ వారికోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం వుందని అఖిలేష్ అభిప్రాయపడ్డట్లు ఆర్. కృష్ణయ్య తెలిపారు. 

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. బిల్లు పెట్టకపోతే  బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.


 

click me!