శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ ముందస్తు కార్యక్రమాలు .. సర్వే, మార్కింగ్ పనుల్లో సిబ్బంది

By Siva KodatiFirst Published Jan 14, 2023, 9:40 PM IST
Highlights

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు వేగవంతం చేసినట్లు హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సర్వే, మార్కింగ్ పనుల్లో సిబ్బంది తలమునకలై వున్నారని ఆయన వెల్లడించారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు వేగవంతం చేసినట్లు హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జనరల్ కన్సల్టెంట్ (జీసీ) కోసం బిడ్‌ల సమర్ఫణకు ఈ నెల 20 చివరి తేదీ వరకు నిపుణులైన కన్సల్టెంట్స్  వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారు. ఈ లోగా మెట్రో అలైన్‌మెంట్‌ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్‌ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS), ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను తెలుసుకునేందుకు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే చేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.  

శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్‌మెంట్‌ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో తయారు చేసిన డీపీఆర్ సాధారణ రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించారని ఆయన చెప్పారు. అయితే నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య  నివాస అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

నానక్ రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ను దృష్టిలో వుంచుకున్నామని ఆయన చెప్పారు. నగరాన్ని దాని శివార్లలోకి విస్తరించడం, పని ప్రదేశాలకు అరగంట కంటే తక్కువ ప్రయాణ దూరంలో సరసమైన ధరలకు గృహాలను అందించాలనే కెసీఆర్ దార్శనికతకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ మెట్రో ను రూపొందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సర్వేలో స్థానిక ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ల సాయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. దీని వల్ల స్టేషన్ స్థానాలను సరిగా గుర్తించడంతో పాటు స్టేషన్ యాక్సెస్ సౌకర్యాలను తక్కువ ఖర్చుతో రూపొందించడంలోను మంచి ఫలితాలను ఇస్తోందని ఎన్‌విఎస్ రెడ్డి అన్నారు.

 


 

click me!