హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. తాజ్‌ కృష్ణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ

Siva Kodati |  
Published : Dec 21, 2022, 09:28 PM IST
హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. తాజ్‌ కృష్ణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌కు అప్పగించింది. దీంతో ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిగ్గీ రాజాతో భేటీ కానున్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్విజయ సింగ్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్‌కు అప్పగించింది. దీంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. 

ఇక్కడికి వచ్చే ముందే ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌ లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. మాణిక్యం ఠాగూర్ ఛాంబర్‌లో బోస్‌రాజు, నదీమ్ జావెద్‌లతో సమావేశమై తాజా పరిస్ధితులపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇన్‌ఛార్జ్‌ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. రేపు రేవంత్ టీమ్‌తో పాటు సీనియర్లతో దిగ్విజయ్ భేటీ కానున్నారు. రెండు వర్గాల వాదనలను తెలుసుకుని .. రేపు మధ్యాహ్నం 3 గంటలకు దిగ్విజయ్ మీడియాతో సమావేశం కానున్నారు. 

ALso REad: టీ కాంగ్రెస్‌లో వివాదాలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు వేగవంతం.. నేడు హైదరాబాద్‌కు దిగ్విజయ్ సింగ్..!

ఇక, పీసీసీ కమిటీల విషయంలో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందన్న సీనియర్ నేతలు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి గళం వినిపించారు. వలస వచ్చినవారికే ఎక్కువ పదవులు దక్కాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ వర్గానికి చెందిన 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ముసలం తీవ్రతరమైంది. ఒర్జినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతలుగా పరిస్థితులు మారాయి. 

ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌లో వివాదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే దిగ్విజయ్ సింగ్.. కొందరు సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడి.. ప్రతి ఒక్కరి వాదనలు వింటామని చెప్పారు. అలాగే మంగళవారం సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల కీలక సమావేశం రద్దయ్యేలా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అసమ్మతి నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్‌ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపనున్నట్టుగా చెప్పారు. అలాగే సమన్వయం పాటించాల్సిందిగా నేతలకు సూచించినట్టుగా తెలిసింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu